ఐపీఎల్‌ పండుగ నేటి నుంచే.. ఈసారి కొత్త నిబంధనలు ఇవీ..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ఐపీఎల్‌ పండుగ నేటి నుంచే.. ఈసారి కొత్త నిబంధనలు ఇవీ Photo: Twitter||

వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: క్షణాల్లో ఆధిక్యం చేతులు మారే సమరాలకు.. ఒత్తిడితో నరాలు తెగే ఉత్కంఠ పోరాటాలకు.. సమయం ఆసన్నమైంది. గత మూడేండ్లుగా పరిమితుల మధ్య సాగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఈసారి కొత్త నిబంధనలతో సరికొత్తగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టాస్‌ తర్వాత తుది జట్టు ఎంపిక.. వైడ్‌, నోబాల్స్‌కు సమీక్ష విధానం.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఇలా ఎన్నో కొంగొత్త నియమాలను పరిచయం చేయనున్న ఐపీఎల్‌-16వ సీజన్‌ ఈ రోజు ప్రారంభంకానుంది. నిన్న మొన్నటి వరకు చెట్టపట్టాలేసుకొని తిరిగిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇకపై ప్రత్యర్థులుగా మైదానంలో తలపడనుండగా.. బెన్‌ స్టోక్స్‌ను ఎలా ఔట్‌ చేయాలని వ్యూహాలు రచించిన రవీంద్ర జడేజా.. అతడితోనే కలిసి ప్రత్యర్థి భరతం పట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌.. బాణాసంచా మోతలు, కండ్లు మిరిమిట్లు గొలిపే కాంతులు, బాలీవుడ్‌ తారాల ఆట పాటల మధ్య ఈరోజు షురూ కానుంది. తొలి పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేండ్లుగా కొన్ని పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్‌.. తిరిగి పూర్వవైభవం సంతరించుకుంది. మొత్తం 10 జట్లు టైటిల్‌ కోసం పోటీ పడుతున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌లో.. మూడేండ్లకు ముందు మాదిరిగా సొంత మైదానంలో సగం మ్యాచ్‌లు.. మిగిలిన సగం మ్యాచ్‌లు ప్రత్యర్థి వేదికలపై జరుగనున్నాయి.

ఇటు పాండ్యా.. అటు ధోనీ

నాయకత్వ బాధ్యతలు అందుకున్న తొలిసారే గుజరాత్‌కు టైటిల్‌ అందించిన పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. తనకు గురువైన మహేంద్ర సింగ్‌ ధోనీతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌, రషీద్‌ ఖాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, కేన్‌ విలియమ్సన్‌, హార్దిక్‌ పాండ్యాతో కూడిన గుజరాత్‌ను ఎదుర్కోవాలంటే చెన్నై శక్తికి మించి పోరాడక తప్పేలా కనిపించడం లేదు. గుజరాత్‌ బౌలింగ్‌కు మహమ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌, హార్దిక్‌ కీలకం కానుండగా.. వికెట్‌ కీపర్‌గా ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మామూలు ఆటగాళ్లను సైతం మేలిమి ముత్యాలుగా మలచగల ధోనీనే సూపర్‌ కింగ్స్‌కు కొండంత అండ అనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతుండగా.. కాన్వే, మోయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడుపై చెన్నై భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. ఇతర జట్లతో పోల్చుకుంటే సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ కాస్త బలహీనంగా కనిపిస్తున్నది.

కొత్త నిబంధనలు

* ఈ ఐపీఎల్‌ నుంచి వైడ్‌, నోబాల్స్‌కు కూడా రివ్యూ చేసుకునే అవకాశం ఉంది.

* గతంలో టాస్‌కు ముందు జట్టు సారథులు ప్లెయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటిస్తూ వస్తుండగా.. ఈ సారి నుంచి టాస్‌ ముగిసిన అనంతరం తుది పదకొండు మందిని ఎంపిక చేసుకోవచ్చు.

* ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఈ సీజన్‌ నుంచి ప్రవేశ పెడుతున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు.. ఫీల్డింగ్‌ సమయంలో అదనపు బౌలర్‌ కావాలనుకుంటే.. ఒక బ్యాటర్‌ను తప్పించి అతడి స్థానంలో స్పేషలిస్ట్‌ బౌలర్‌ను బరిలోకి దింపొచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్