||ఐపీఎల్ 2023 ప్రారంభోత్సవంలో అదరగొట్టిన రష్మిక, తమన్నా Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: గత మూడేళ్లుగా సడి చప్పుడు లేకుండా సాగిన ఐపీఎల్.. ఈ సారి అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా కారణంగా మూడేళ్ల నుంచి ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్ నిర్వహించగా.. ఈసారి పరిస్థితులు అనుకూలించడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్ల మధ్య ఐపీఎల్‌కు తెరలేచింది. కండ్లు మిరిమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, చెవులు హోరెత్త మ్యూజిక్ షోతో పాటు టాప్ స్టార్ల నృత్య ప్రదర్శనతో ఐపీఎల్-16వ సీజన్ ప్రారంభమైంది. గత పదిహేనేళ్లుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్.. ఈ సారి కొత్త నిబంధనలతో సరికొత్తగా షురూ అయింది. సీజన్ తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా.. లీగ్ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు అభిమానులను ఉర్రూతలూగించాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి లక్ష మందికి పైగా ప్రేక్షకులు మ్యాచ్‌ను తిలకించేందుకు మైదానానికి తరలిరాగా.. వారి సందడిలో అహ్మదాబాద్ నగరం మొత్తం ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోయింది.
అర్పిత్, తమన్నా, రష్మిక స్పెషల్ ఆటా పాట
బాలీవుడ్ సింగర్ అర్పిత్ సింగ్ మ్యూజిక్ షోతో ప్రారంభమైన ఆరంభ వేడుకల్లో సినీ తారాలు సందడి చేశారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్లు తమన్నా భాటియా, రష్మిక మంధన తమ ఆట పాటలతో అభిమానులను ఉర్రూతలూగించారు. సిల్వర్ కలర్ డ్రెస్‌లో ప్రత్యేక వేదిక మీదకు వచ్చిన తమన్నా.. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’’ సాంగ్‌కు అదిరే స్టెప్స్ వేసి స్టేడియాన్ని హోరెత్తించింది. ఆ తర్వాత తమిళ, హింది సహా ఇతర భాషల పాటలకు చిందులు వేఇసింది. కాసేపటికి వేదికపైకి వచ్చిన రష్మిక మంధన... పుష్పలోని సామీ సామీ పాటకు డాన్స్ చేసింది. తన ట్రేడ్ మార్క్ స్టెప్‌తో రష్మిక స్టేడియాన్ని హోరెత్తించింది. దీంతో పాటు శ్రీ వల్లి పాట హిందీ వర్షన్‌కు రష్మిక కాలు కదిపింది. దీంతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌లోని ఆస్కార్ సాంగ్ ‘నాటు నాటు’కు రష్మిక తనదైన స్టెప్పులు వేసింది. ప్రత్యేక కార్యక్రమాల అనంతరం హోస్ట్ మందిరా బేడీ.. బీసీసీఐ పెద్దలను స్టేజ్ మీదకు ఆహ్వానించగా.. వారు ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధూమల్ తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్-16వ సీజన్ తొలి పోరులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది.