T20 World Cup RSA vs AFG : సెమీఫైనల్ -1 పోరులో భాగంగా జరిగిన దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో మాక్రమ్ సేన 9 వికెట్ల తేడాతో గెలిచింది.
చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా Photo: x.com
న్యూయార్క్, ఈవార్తలు : సంచలనాలు లేవు.. మెరుపులు లేవు.. దక్షిణాఫ్రికాకు ఆఫ్ఘనిస్థాన్ ఝలక్ ఇస్తుందేమో అనుకున్నారంతా. కానీ, మాక్రమ్ సేన విజృంభణ ముందు రషీద్ ఖాన్ సేన తేలిపోయింది. సెమీఫైనల్ -1 పోరులో భాగంగా జరిగిన దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో మాక్రమ్ సేన 9 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్.. బరిలోకి దిగి 56 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ గుర్బాజ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినవాళ్లంతా వచ్చినట్టే పెవిలియన్ చేరారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో అజ్మతుల్లా (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతవారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మొత్తం ముగ్గురు డకౌట్ అయ్యారు. 11.5 ఓవర్లకే రషీద్ సేన చాప చుట్టేసింది. పైగా, 56 పరుగుల్లో 13 పరుగులు ఎక్స్‌ట్రా ద్వారా వచ్చనవే. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, షంషీ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. రబాడా, నోర్ట్జ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 57 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలో టార్గెట్ ఛేదించింది. క్వింటెన్ డికాక్ 5 పరుగులే చేరి పెవిలియన్ చేరాడు. అయితే, మరో వికెట్ పడకుండా, హెన్‌డ్రిక్స్ (29), కెప్టెన్ మార్క్రమ్ (23) లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఆప్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫరూకీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో మార్క్రమ్ సేన టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మార్కో జాన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.