India vs England | పిచ్ సహకరించడంతో భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ క్రీజులో కుదురుకోకుండా వరుసగా పెవిలియన్ చేర్చారు.
ఇంగ్లండ్ ఇండియా సెమీ ఫైనల్2
బ్యాటింగ్‌లో, కెప్టెన్సీలో రోహిత్ శర్మ దూకుడు..ఆకాశమే హద్దుగా చెలరేగే సూర్యకుమార్ యాదవ్.. వైవిధ్యమైన బంతులతో ముప్పుతిప్పలు పెట్టే బుమ్రా..స్పిన్ మాయాజాలంతో మంత్రం వేసే అక్షర్, కుల్దీప్..ఇలా.. ఒక్కరిద్దరు కాదు.. ఆల్ రౌండ్ ప్రతిభతో టీమిండియా సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది.
India vs England | టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్-2లో భారత్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబర్చింది. పిచ్ సహకరించడంతో భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 172 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ క్రీజులో కుదురుకోకుండా వరుసగా పెవిలియన్ చేరారు. వరుస ఎండ్‌ల నుంచి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో బ్రిటిష్ బ్యాటర్ల భరతం పట్టారు. జోస్ బట్లర్ 15 బంతుల్లో 23, హ్యారీ బ్రూక్ 19 బంతుల్లో 25, లివింగ్ స్టోన్ 16 బంతుల్లో 11 పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్ రనౌట్ అయ్యారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఇంగ్లండ్ 16.3 ఓవర్లకు 103 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
అంతకుముందు టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ తన ఫామ్‌ను కొనసాగించాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 57 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. 9 బంతుల్లో 9 పరుగులే చేసి టోప్లే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 6 బంతుల్లో 4 పరుగులే చేశాడు. అయితే, పంత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 13 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 9 బంతుల్లో 17, అక్షర్ పటేల్ 6 బంతుల్లో 10 పరుగులు చేశారు. శివం దుబే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు దక్కించుకోగా, టోప్లే, ఆర్చర్, సామ్ కరన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు. టీమిండియా ఇన్నింగ్స్ మధ్యలో వర్షం కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. చివరగా ఈ నెల 29న (ఆదివారం) దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.