సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి సెమీస్ పోరుకు సిద్ధమైంది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 181/7 వద్దే ఆగిపోయింది.
రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్సింగ్స్
న్యూయార్క్, ఈవార్తలు : టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి సెమీస్ పోరుకు సిద్ధమైంది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 181/7 వద్దే ఆగిపోయింది. అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌ను బ్యాటింగ్‌కు పిలిచింది. టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. ఐదు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ (15) కూడా పెద్దగా రాణించలేదు. అయితే, తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. శివం దుబే (28), హార్దిక్ పాండ్యా (27*), జడేజా (9*) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, హేజల్‌వుడ్ ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు.
లక్ష్య ఛేదనలో 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మార్ష్ 28 బంతుల్లో 37 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (19) ఫర్వాలేదనిపించగా, స్టోయినిస్ (2) తేలిపోయాడు. ట్రావిస్ హెడ్ (76) పోరాడినా, బుమ్రా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మథ్యు వేడ్ (1), టిమ్ డేవిడ్ (15) పోరాడలేకపోయారు. చివర్లో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ చేతులెత్తేయాల్సి వచ్చింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోగా, కుల్దీప్ రెండు, బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు.
తాజా ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ బెర్తు క్లిష్టంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్, భారత్‌పై ఓడిపోవటంతో బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే కంగారులు ఇంటి దారి పట్టాల్సిందే. అప్పుడు ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ బరిలో ఉంటుంది. అటు.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీస్ చేరిన విషయం తెలిసిందే.