టీ20 క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||డికాక్ వీర బాదుడు Photo: twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఆహా! ఇది కదా టీ20 మ్యాచ్‌ అంటే!! ఇది కదా పరుగుల వదర, బౌండ్రీల జడివాన, సిక్సర్ల సునామీ అంటే! పొట్టి ఫార్మాట్‌లో సెంచరీ చేయడమే కష్టం అనుకుంటే.. ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలు.. 46 ఫోర్లు, 35 సిక్సర్లు నమోదయ్యాయంటే మామూలు మాటలా! మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 258 పరుగులు చేస్తే ఛేదనలో మరో జట్టు ఇంకా 7 బంతులు మిగిలుండగానే 259 పరుగులు చేసిందటే నమ్మశక్యమా? కానీ ఇదే నిజం. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 ఈ రికార్డులకు వేదికైంది. పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డుల్లోకెక్కింది. విండీస్‌ యంగ్‌ గన్‌ జాన్సన్‌ చార్లెస్‌ సెంచరీతో చెలరేగితే.. సఫారీ ఓపెనర్‌ డికాక్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. పరుగుల వరద పారిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పోరులో ఇరు జట్లు కలిపి 517 పరుగులు చేయడం విశేషం. 

చార్లెస్‌ వీరబాదుడు..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. జాన్సన్‌ చార్లెస్‌ (46 బంతుల్లో 118; 10 ఫోర్లు, 11 సిక్సర్లు) అద్వితీయ శతకం నమోదు చేసుకోగా.. కైల్‌ మయేర్స్‌ (27 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. ఆఖర్లో పావెల్‌ (28), షెఫర్డ్‌ (41 నాటౌట్‌; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో విండీస్‌ భారీ స్కోరు చేసింది. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్‌ 3, వైన్‌ పార్నెల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. విండీస్‌ ఆట చూసినంత సేపు ఇక ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం దక్షిణాఫ్రికా వల్ల కాదనే అనిపించింది. అయితే ఛేదన ప్రారంభమైన మూడు ఓవర్లలోనే పరిస్థితి తలకిందులైంది. విండీస్‌ బ్యాటర్లు వీర లెవల్లో విజృంభిస్తే.. సఫారీ బ్యాటర్లు విధ్వంసానికి అర్థం మార్చుతూ చెలరేగిపోయారు. 

డికాక్‌ ధనాధన్‌.. 

 లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. టీ20 క్రికెట్‌లో ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన కావడం గమనార్హం. స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలిలా విరుచుకుపడగా.. రీజా హెండ్రిక్స్‌ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచూరియన్‌లో సునామీ సృష్టించాడు. డికాక్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. భారీ లక్ష్యఛేదనలో వీరిద్దరూ తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలోనే 152 పరుగులు చేసి చేజింగ్‌ను సులువుగా మార్చేయగా.. చివర్లో కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (38 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. డికాక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. గతంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక పరుగలను ఛేదించిన దక్షిణాఫ్రికా.. ఇప్పుడు టీ20ల్లో అలాంటి ప్రదర్శనతోనే అదరగొట్టింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్