||స్మృతి మందన Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూ్యపీఎల్)లో బోణీ కొట్టింది. వరుస పరాజయాలతో విసిగిపోయిన ఆర్సీబీ ఆరో మ్యాచ్‌లో గెలుపు రుచిచూసింది. వేలంలో అందరికంటే అత్యధిక ధర దక్కించుకున్న భారత ఓపెనర్ స్మృతి మంధన సారథ్యంలోని బెంగళూరు.. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన అనంతరం తొలి విజయం ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన పోరులో బెంగళూరు 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఇప్పటికే ఐదు పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైన బెంగళూరు.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. గ్రేస్ హారీస్ (46) టాప్ స్కోరర్ కాగా.. కిరణ్ (22), దీప్తి (22) పర్వాలేదనిపించారు. కెప్టెన్ అలీసా హీలీ (1), దేవిక వైద్య (0), తహిలా మెక్‌గ్రాత్ (2), సిమ్రన్ (2) విఫలమవడంతో ఒక దశలో యూపీ 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా.. గ్రేస్ హ్యారిస్ గొప్పగా పోరాడింది. వైస్ కెప్టెన్ దీప్తి శర్మతో కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టుకు పోరాడే స్కోరు అందించింది. బెంగళూరు బౌలర్లలో ఎలీస పెర్రీ 3, సోఫియా డివైన్, శోభన ఆశ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మేగన్ షుట్, శ్రేయాంక పాటిల్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
స్టార్ ఓపెనర్ డకౌట్..
లీగ్ ఆరంభానికి ముందే అదిరిపోయే ధర దక్కించుకొని వార్తల్లో నిలిచిన బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధన.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవతోంది. స్వల్ప లక్ష్యఛేదనలోనూ స్మృతి ఆకట్టుకోలేకపోయింది. భారత టాప్ స్పిన్నర్ దీప్తి బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన సోఫియా డివైన్ ఆఖరి బంతికి ఔట్ కాగా.. రెండో ఓవర్‌లో ఖాతా తెరవకుండానే మంధన ఆమెను అనుసరించింది. ఈ దశలో ఛేదన కష్టమే అనిపించినా.. హీతర్ నైట్ (24), ఎలీసా పెర్రీ (10) కాస్త పోరాడే బెంగళూరును పోటీలో నిలిపారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా.. కనిక అహుజా (30 బంతుల్లో 46; 8 ఫోర్లు, ఒక సిక్సర్), రిచా ఘోష్ (32 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకోవడంతో బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో దీప్తి రెండు వికెట్లు పడగొట్టింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన కనిక అహుజాకు ‘ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.