సిరాజ్‌ రెచ్చిపో.. హోం గ్రౌండ్‌లో దుమ్మురేపాలన్న రోహిత్‌ శర్మ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| ప్రతీకాత్మక చిత్రం Photo: twitter ||

వేగం సరే కానీ..

నిలకడ లేదు! 

బంతులు బాగానే వేస్తున్నాడు కానీ.. 

పరుగులు ధారాళంగా ఇస్తున్నాడు!

టెస్టుల వరకైతే నమ్మొచ్చు కానీ..

పరిమిత ఓవర్ల ఆటలో కష్టమే.. 


ఏడాది క్రితం హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి వినిపించిన మాటలివి. అయితే విమర్శలకు వెరవని ఈ గల్లీ బాయ్‌.. అవరోధాలనే సోపానాలుగా మార్చుకుంటూ.. ఆటంకాలనే ప్రోత్సాహకాలుగా భావిస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. జాతీయ జట్టుకు ఆడటమే తన ప్రధాన కర్తవ్యమని.. తండ్రి కడచూపునకు కూడా నోచుకోకుండా.. కష్టపడ్డ ఈ హైదరాబాదీ ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. గతేడాది టీమిండియా తరఫున అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన సిరాజ్‌.. హోంగ్రౌండ్‌ (ఉప్పల్‌)లో తొలి మ్యాచ్‌కు రెడీ అవుతున్నాడు. 


ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: టెస్టు క్రికెట్‌లో ప్రధాన పేసర్‌గా ఎదిగిన మహమ్మద్‌ సిరాజ్‌.. ఏడాది కాలంగా వన్డేల్లోనూ విజృంభిస్తున్నాడు. పరుగులు ధారాళంగా ఇస్తాడనే అపవాదును తుడిచేస్తూ.. గతేడాది చక్కటి ప్రదర్శన కనబర్చాడు. నిలకడైన వేగం.. కొత్త బంతి లైట్‌ స్వింగ్‌ రాబట్టడం.. ప్రత్యర్థి ఊహకు అందని బంతులతో బోల్తా కొట్టించడం వంటి తన అమ్ముల పొదిలోని అస్త్రాలతో దుమ్మురేపుతున్నాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో నాలుగు వికెట్లు పడగొట్టిన ఈ హైదరాబాదీ.. సొంతగడ్డపై తొలి వన్డే ఆడేందుకు రెడీ అవుతున్నాడు. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శనతో ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సిరాజ్‌.. ఆ తర్వాత అనతి కాలంలోనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక అదే జోరు కొనసాగిస్తూ.. టెస్టు టీమ్‌లో స్థానం సుస్థిరం చేసుకున్న సిరాజ్‌.. వన్డే ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య బుధవారం ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో సత్తాచాటాలని సిరాజ్‌ తహతహలాడుతున్నాడు. 


ఇషాన్‌ మిడిలార్డర్‌లోనే..

ఇప్పటికే నగరానికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి పోగా.. మ్యాచ్‌కు ముందు రోజు ఇరు జట్ల కెప్టెన్‌లు మీడియాతో మాట్లాడారు. సొంతగడ్డపై తొలి వన్డే ఆడుతున్న సిరాజ్‌ రాణించాలని కోరుకుంటున్నట్లు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో మా శక్తి సామర్థ్యాలు పరీక్షించుకునేందుకు ఇది సరైన అవకాశం. శ్రీలంకతో సిరీస్‌లో తుది జట్టులో అవకాశం దక్కని ఇషాన్‌ కిషన్‌ ఈసారి మిడిలార్డర్‌లో ఆడతాడు. సిరాజ్‌ మంచి జోష్‌లో ఉన్నాడు. రోజు రోజుకు అతడి గ్రాఫ్‌ పెరుగుతూ ఉంది. కొత్త బంతితో వికెట్లు తీస్తున్నాడు. తొలిసారి హోమ్‌ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న సిరాజ్‌కు ఆల్‌ ది బెస్ట్‌. మూడు ఫార్మాట్లలో అతడు ముఖ్యమైన ప్లేయర్‌, వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని అతడిపై వర్క్‌లోడ్‌ పడకుండా చూసుకుంటాం. ప్రస్తుతం భారత జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తోంది’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ లాథమ్‌ మాట్లాడుతూ.. ‘విలియమ్సన్‌, టిమ్‌ సౌథీ అందుబాటులో లేకపోవడంతో యువ ఆటగాళ్లకు అవకాశాలిచ్చాం. ఈసారి భారత్‌లోనే వన్డే ప్రపంచకప్‌ జరుగనుంది. కాబట్టి ఈ సిరీస్‌ కీలకంగా భావిస్తున్నాం. పాకిస్థాన్‌ వన్డే సిరీస్‌ నెగ్గడం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే ఆటతీరు కనబరుస్తూ.. సిరీస్‌ నెగ్గలని అనుకుంటున్నాం’ అని అన్నాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్