||చెన్నైపై గుజరాత్ గెలుపు Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: లక్ష మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో వేసవి వినోదాల విందుకు నగారా మోగగా.. ఐపీఎల్-16వ సీజన్ తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. గత మూడేండ్లుగా పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్ ఈసారి పూర్తి స్థాయి ప్రేక్షకులతో ఇంటా, బయట పద్ధతిలో ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం అట్టహాసంగా సాగిన ఆరంభ వేడుకల అనంతరం జరిగిన తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 92; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. యంగ్ గన్ శుభ్‌మన్ గిల్ (36 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. చెన్నై బౌలర్లలో రాజ్‌వర్ధన్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
సహచరులు విఫలమైన చోట
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ కట్టుదిట్టంగా వేసిన గుజరాత్ పేసర్ మహమ్మద్ షమీ.. తన రెండో ఓవర్‌లో కాన్వేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే రుతురాజ్‌కు మోయిన్ అలీ జత కలవడంతో ఇన్నింగ్స్ సజావుగా సాగింది. ఈ జోడీ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మోయిన్ అలీ బౌండ్రీలపై దృష్టి పెడితే.. సిక్సర్లు కొట్టడానికి క్రీజులోకి వచ్చినట్లు గైక్వాడ్ వీరంగమాడాడు. కుదురుకున్నాడనుకున్న అలీ.. రషీద్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. ఆ తర్వాత ఏ ఒక్కరూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. హర్దిక్ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన గైక్వాడ్.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు అరుసుకున్నాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అప్పటికే స్టోక్స్ కూడా వెనుదిరగగా.. రాయుడు (12), శివమ్ దూబే (19) నెమ్మదిగా ఆడారు. సెంచరీకి 8 పరుగుల దూరంలో రుతురాజ్ వెనుదిరగగా.. చివర్లో ధోనీ (7 బంతుల్లో 14 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) బ్యాట్ ఝళిపించడంతో చెన్నై పోరాడే స్కోరు బోర్డుపై పెట్టింది.
గుజరాత్ ఆడుతూ పాడుతూ..
టార్గెట్ ఎక్కువ లేకపోవడంతో గుజరాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన వృధ్ధిమాన్ సాహా నాలుగో ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ కొన్ని విలువైన పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న శుభ్‌మన్ గిల్ ఐపీఎల్లోనూ అదే జోరు కొనసాగించాడు. మంచి బంతులకు మర్యాద ఇచ్చిన గిల్.. చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి బౌండ్రీ దాటించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8) ఎక్కువసేపు నిలువలేకపోగా.. అర్ధశతకం అనంతరం గిల్ వెనుదిరిగాడు. విజయ్ శంకర్ కీలక దశలో ఔట్ కాగా.. రాహుల్ తెవాటియా (15 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్), రషీద్ ఖాన్ (3 బంతుల్లో 10 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) మిగిలిన పనిపూర్తి చేశారు.
తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్
ఐపీఎల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను మొదటి మ్యాచ్‌లో ఇరుజట్లు వినియోగించుకున్నాయి. బ్యాటింగ్‌లో అంబటి రాయుడు సేవలను వినియోగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. బౌలింగ్‌కు దిగే సమయంలో జట్టు నుంచి రాయుడును తప్పించి అతడి స్థానంలో పేస్ బౌలర్ తుషార్ దేశ్ పాండేను బరిలో దింపింది. ఐపీఎల్లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్ రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా ఈ నిబంధనను వాడుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ స్థానంలో.. సాయి సుదర్శన్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా తీసుకుంది.