షఫాలీ తుఫాన్‌.. గుజరాత్‌ బౌలర్లను ఊచకోత కోసిన ఢిల్లీ ఓపెనర్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||షఫాలీ వర్మ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: లేడీ సెహ్వాగ్‌ షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. బౌలర్‌తో సంబంధం లేకుండా దంచుడే పరమావధిగా పెట్టుకున్న షఫాలీ ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోసింది. ఫలితంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్లూ్యపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. కిమ్‌ గార్త్‌ (32 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. హర్లీన్‌ (20), జార్జియా (22) పర్వాలేదనిపించారు. సబ్బినేని మేఘన (0), వాల్వర్ట్‌ (1), ఆష్లే గార్డ్‌నర్‌ (0), దయాలన్‌ హేమలత (5), సుష్మ వర్మ (2) విఫలమయ్యారు. మూనీ గాయం కారణంగా డబ్లూ్యపీఎల్‌కు దూరమవడంతో గుజరాత్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న భారత యువ ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో కాప్‌ 5 వికెట్లతో గుజరాత్‌ పతనాన్ని శాసింగా.. శిఖ పాండే మూడు వికెట్లు ఖాతాలో వేసుకుంది. 

7.1 ఓవర్లలోనే..

స్వల్ప లక్ష్యచేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) వీర విజృంభణ కొనసాగించగా.. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (21 నాటౌట్‌) ఫర్వాలేదనిపించింది. టార్గెట్‌ చిన్నది కావడంతో పాటు గత మ్యాచ్‌లో ఓటమి వేధిస్తుండటంతో ఢిల్లీ ఆది నుంచే దూకుడుగా ఆడింది. చూస్తున్నది లైవ్‌ మ్యాచా.. లేక హైలైట్సా అన్న తరహాలో షఫాలీ బంతి బంతికి విభిన్న రీతిలో షాట్లు ఆడుతూ.. మైదానాన్ని హోరెత్తించింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న షఫాలీ అదే జోరు ఇక్కడ కొనసాగించింది. వారంతం కావడంతో మైదానానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రాగా.. షఫాలీ తన షాట్‌ సెలక్షన్‌తో ప్రేక్షకుల దిల్‌ ఖుష్‌ చేసింది. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో స్టేడియంను ఉర్రూతలూగించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. లీగ్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లాడిన ఢిల్లీకి ఇది మూడో విజయం కాగా.. ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకున్న క్యాపిటల్స్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ముంబై ఇండియన్స్‌ టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుండగా.. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బెంగళూరు అట్టడుగున ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్