||ధోనీ, రోహిత్ శర్మ, సెహ్వాగ్||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాయకత్వంలో మహేంద్రసింగ్ ధోనీ కంటే.. రోహిత్ శర్మ బెటర్ అని భారత మాజీ ఓపెనర్, విధ్వసంక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్లో సారథిగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ధోనీ నాలుగు ట్రోఫీలు అందించగా.. రోహిత్ శర్మ తన నాయకత్వ పటిమతో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ఇప్పటికే 15 వసంతాలు పూర్తి చేసుకున్న ఐపీఎల్.. వచ్చే నెలలో 16వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెహ్వాగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా సేవలందించిన మహేంద్రసింగ్ ధోనీ.. ఐసీసీ టీ20, వన్డే ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఇక మరోవైపు రోహిత్ శర్మ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇద్దరి నాయకత్వి తీరు దాదాపుగా ఒకే విధంగా ఉంటుందని పలువురు మాజీలు పేర్కొనగా.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అంకెలే అన్నీ చెబుతాయి. భారత జట్టు కెప్టెన్‌గా ధోనీకి అపార అనుభవం ఉంది. అక్కడి నుంచే అతడు చెన్నై సారథిగా ఎంపికయ్యాడు. కానీ, రోహిత్ అలా కాదు. అతడు ముంబై ఇండియన్స్ నుంచే కెప్టెన్సీ ప్రారంభించాడు. అందుకే అతడికే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా అచ్చం ఇలాగే అద్భుతాలు చేసి చూపించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ మచ్చతో కొట్టుమిట్టాడుతున్న జట్టును గాడిన పెట్టి.. దాదా అద్భుత ఫలితాలు రాబట్టడంతో పాటు వన్డేల్లో టీమిండియాను నంబర్‌వన్ జట్టుగా నిలబెట్టాడు. ఇలాంటి లక్షణాలే రోహిత్‌లోనూ ఉన్నాయి కాబట్టి.. నా ఓటు హిట్‌మ్యాన్‌కే’ అని సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్ ప్రారంభమై 15 ఏళ్లు పూరెన సందర్భంగా ఓ ప్రైవేట్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో వీరు ఈ వ్యాఖ్యలు చేశాడు.
భజ్జీ ఓటు మహీకే!
ఐసీసీ తొలిసారి (2007లో) నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో యువ భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించగా.. ఆ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. పొట్టి ఫార్మాట్‌కు వచ్చిన క్రేజ్‌నుతో మరుసటి ఏడాదే ఐపీఎల్‌కు అంకురార్పణ జరిగింది. ఆరంభంలో ఎనిమిది జట్లతో ప్రారంభమైన లీగ్.. ప్రస్తుతం 10 జట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో అన్నిటికి రారాజులా ఐపీఎల్ కొనసాగుతోంది. పురుషుల లీగ్‌కు వచ్చిన పేరు ప్రతిష్ఠలను దృష్టిలో పెట్టుకొని మహిళల కోసం ప్రత్యేక లీగ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూ్యపీఎల్) తొలి సీజన్‌కు ఈ ఏడాదే తెర లేవనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సారథ్య చర్చ వచ్చిన ప్రతిసారి ధోనీ, రోహిత్ మధ్య పోలిక రావడం పరిపాటి కాగా.. హర్భజన్ మాత్రం సెహ్వాగ్‌తో విభేదించాడు. ‘లీగ్ ఆరంభం నుంచి మహేంద్రసింగ్ ధోనీ దాదాపు ఒకే ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాడు. చెన్నైని విజయవంతంగా నిలబెట్టడం వెనుక అతడి కృషి మరువలేనిది. మహీ నాయకత్వంలో చెన్నై మరో లెవల్‌కు చేరింది. మిగిలిన కెప్టెన్లు కూడా తమ తమ జట్లను చాంపియన్స్‌గా నిలిపినా.. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ధోనీనే బెస్ట్ కెప్టన్. అందుకే నా ఓటు మహీకే. ట్రోఫీల విషయంలో ధోనీ కన్నా.. రోహిత్ ఒక అడుగు ముందున్నాడనేది వాస్తవం. కానీ రెండు జట్ల (ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్) తరఫున ఆడిన అనుభవంతో చెబుతున్నా ధోనీనే గొప్ప’ అని హర్భజన్ పేర్కొన్నాడు.