సీఎస్‌కేది పిచ్చి నిర్ణయం: సదగొప్పన్ రమేష్
సదగోపన్ రమేష్
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ట్రేడింగ్ స్వాప్ డీల్ ద్వారా రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు వదిలేసి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటుంది. ఈ డీల్‌పై అధికార ప్రకటన రాకపోయినా.. దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సదగొప్పన్ రమేష్ తప్పుబట్టాడు. సంజూ శాంసన్ కోసం రవీంద్ర జడేజాను వదిలేయడం సరికాదన్నాడు. 'చెపాక్‌లో సంజూ శాంసన్‌కు సరైన రికార్డ్ లేదు. అయితే అతను అక్కడ కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అక్కడ ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే రాణించే అవకాశం ఉంది. కానీ టర్నింగ్ ట్రాక్‌లపై అతను రాణించలేడనే వాదన ఉంది. అతను గొప్ప ప్రదర్శనలు కూడా చేయలేదు. కానీ టర్నింగ్ ట్రాక్‌పై జడేజా ప్రమాదకర బౌలర్. అతన్ని ఎవరూ ఎదుర్కోలేరు. జడేజాను వదిలేస్తే సీఎస్‌కే కచ్చితంగా బలహీనపడుతుంది. అయితే సంజును తీసుకోవడం వల్ల చెన్నై టీమ్ బలపడుతుందా? అంటే అవునని సమాధానం చెప్పలేం. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్లాట్ వికెట్లపై జడేజాకు సవాలే ఎదురు కానుంది. జడేజా ముఖ్యంగా చెపాక్ మైదానంలో సీఎస్‌కే కమాండర్. అతను ఒక్కడే సీఎస్‌కే కోసం చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. అతను మొత్తం గణంకాలు అద్భుతమైన ప్రభావాన్ని ఇవ్వకపోయినా.. కీలక సమయంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను అద్భుతమైన ఫీల్డింగ్, క్యాచ్‌లతో సత్తా చాటాడు. సీఎస్‌కే కోసం అదనంగా 200-300 పరుగులు సేవ్ చేసి ఉంటాడు. అతనికి ఉన్న ఫిట్‌నెస్‌తో మరో 2-3 ఏళ్లు ఈజీగా ఐపీఎల్ ఆడగలడు.'అని సదగొప్పన్ రమేష్ చెప్పుకొచ్చాడు.