SA vs IND | T20 World Cup విజేత టీమిండియా.. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్

T20 World Cup Winner 2024 | టీమిండియా విజయదుందుబి మోగించింది. టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

team india

టీమిండియా ఘన విజయం

T20 World Cup | టీమిండియా విజయదుందుబి మోగించింది. టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసింది. అటు.. దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. వచ్చీ రావటంతోనే దూకుడును ప్రదర్శించింది. మార్కో జాన్సెన్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే కోహ్లీ మూడు ఫోర్లు కొట్టి ఊపు తెచ్చాడు. కేశవ్ మహారాజ్ వేసిన రెండో ఓవర్‌లోనూ రోహిత్ శర్మ రెండు ఫోర్లు కొట్టి మరింత ఉత్తేజాన్ని తెచ్చాడు. కానీ, అంతలోనే రోహిత్ క్యాచ్ అవుట్ అయ్యాడు. క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి షాకిచ్చాడు. ఆ ఓవర్‌లోనే చివరి బంతికి పంత్ డకౌట్.. దాంతో ఒక్కసారిగా భారత అభిమానుల్లో నైరాశ్యం కనిపించింది. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ (3) రావటంతో ఫర్వాలేదనుకున్నా.. రబాడా బౌలింగ్‌లో క్లాసెన్‌కే చిక్కాడు. ఇక్కడే కెప్టెన్ రోహిత్ శర్మ అసలైన కెప్టెన్సీని ప్రదర్శించాడు. దుబే, పాండ్యా, జడేజా లాంటి బ్యాటర్లు ఉన్నా.. అక్షర్ పటేల్‌ను రంగంలోకి దించాడు.

అంది వచ్చిన అవకాశం.. పైగా ఫైనల్.. తనెంత విలువైన ఆటగాడినో తెలియజెప్పాడు. అవతలి ఎండ్‌లో కింగ్ కోహ్లీ అండతో.. దొరికిన చెత్త బంతినల్లా బౌండరీ దాటించాడు. 31 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి. కోహ్లీ, అక్షర్ కలిసి ఒక్కో బంతికి ఒక్కో రన్ జోడిస్తూ స్కోర్ బోర్డును కదిలించారు. కీలక సమయంలో అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శివం దుబే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 16 బంతుల్లో 27 స్కోర్ చేశాడు. అప్పటిదాకా కుదురుగా ఆడిన కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తికాగానే రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీ అవుట్ అయ్యాక పాండ్యా (5*), జడేజా 2 పరుగులు చేశారు. దీంతో స్కోర్ ఏడు వికెట్లకు 176కు చేరింది.

అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. ఆదిలోనే హెన్రిక్స్ (4) వికెట్ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన ఇన్ స్వింగ్‌తో వికెట్లను గిరాటేశాడు. ఆ వెంటనే అర్షదీప్ బౌలింగ్‌లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ మార్క్రమ్ (4) అవుట్ అయ్యాడు. అవతలి ఎండ్‌లో డికాక్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, స్టబ్స్ కూడా ఆచితూచి ఆడాడు. అయితే, అక్షర్ పటేల్ అద్భుతమైన బంతితో స్టబ్స్‌(31)ను బౌల్డ్ చేశాడు. క్లాసెన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సెమీఫైనల్‌లో స్పిన్ మంత్రం ఫైన‌ల్‌లో ఏ మాత్రం ఫలించలేదు. కుల్దీప్, అక్షర్‌ పటేల్‌ను టార్గెట్ చేసిన క్లాసెన్.. బాల్‌ను బౌండరీలు దాటించాడు. అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో రెండు ఎక్స్‌ట్రాలు సహా 26 పరుగులు పిండేశాడు. 27 బంతుల్లోనే 52 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉండగా, బుమ్రా అద్భుతమైన ఓవర్లతో రాణించాడు. చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా, హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతికి మిల్లర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. బౌండరీ వద్ద సూర్య కుమార్ యాదవ్ అద్భుత క్యాచ్‌తో మ్యాచ్ టర్న్ అయ్యింది. మొత్తం 8 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 169 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి పొట్టి కప్‌ను ముద్దాడింది. ఇది భారత్‌కు రెండో టీ20 కప్.














సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్