ఐపీఎల్ 18లో భాగంగా జరిగిన 24వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయఢంకా మోగించింది. ఢిల్లీ బ్యాటర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది.
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్ : ఐపీఎల్ 18లో భాగంగా జరిగిన 24వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయఢంకా మోగించింది. ఢిల్లీ బ్యాటర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. సిక్స్ కొట్టి ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు కేఎల్ రాహుల్. 53 బంతుల్లో 93 పరుగులు చేశాడు. అందులో 6 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. 164 పరుగుల లక్ష్యఛేదనలో మూడు వికెట్లు టపటపా పడినా, అక్షర్ పటేల్, స్టబ్స్‌తో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ నిర్మించాడు. మొదట్లో కుదురుగా ఆడినా, చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అటు.. రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మొదటి 4 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(37), విరాట్ కోహ్లీ(22) దూకుడుగా ఆడారు. రజత్ పాటిదార్ 25, కృనాల్ పాండ్యా 18 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు.
చరిత్ర సృష్టించిన కోహ్లీ
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 1000 బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నాలుగో ఓవర్ మూడో బంతికి విరాట్ కోహ్లీ సిక్స్ బాది ఐపీఎల్లో 1000 బౌండరీలను పూర్తి చేశాడు. ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు బాదిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది. సిక్సర్ల పరంగా మూడో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ (357 సిక్సర్లు), రోహిత్ శర్మ (282 సిక్సర్లు) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. కోహ్లీ ఐదు సిక్సర్లు బాది ఉంటే రోహిత్ను అధిగమించేవాడు. మొత్తంగా 920 బౌండరీలతో శిఖర్ ధావన్ రెండో స్థానంలో, 899 బౌండరీలతో డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నారు.