ధోనీ టీమ్ వల్లే న్యూజిలాండ్‌పై టీమిండియా ఓటమి.. రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు

టీమిండియా ఓటమికి కారణం ఏంటి? అనేది బయటపెట్టాడు మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప. ధోనీ టీమ్ వల్లే టీమిండియా ఘోర పరాజయం పాలైందని ఆరోపించాడు. దానికి సహేతుకమైన కారణాన్నీ వివరించాడు.

robin uthappa

రాబిన్ ఊతప్ప 

ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్ : సొంత గడ్డపై న్యూజిలాండ్‌ను ఓడించలేక టీమిండియా చేతులెత్తేసింది. చరిత్రలో తొలిసారి సొంతగడ్డపై అత్యంత దారుణంగా 0-3గా వైట్ వాష్ అయ్యి సిరీస్‌ను కోల్పోయింది. దీనికి అంతటికీ రోహిత్ శర్మ కెప్టెన్సీ సరిగా చేయకపోవడం, విరాట్ కోహ్లీ రాణించకపోవడం, సీనియర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పేలవ బౌలింగ్ కారణం అని అంతా విమర్శలు గుప్పించారు. అదే సమయంలో న్యూజిలాండ్ జట్టు మాత్రం అంచనాలకు మించి రాణించింది. శ్రీలంకతో ఘోర పరాజయం తర్వాత పుంజుకొని టీమిండియాను మట్టి కరిపించింది. భారత పిచ్‌లు అంటేనే బెంబేలెత్తిపోయే కివీస్ బ్యాటర్లు.. ఈ సారి మాత్రం దూకుడుగా, నిలకడగా ఆడారు. ఒకానొక సందర్భంలో కివీస్ బ్యాటర్లను చూసి టీమిండియా ఆటగాళ్లు కొంచెమైనా నేర్చుకోవాలని క్రికెట్ పండితులు విమర్శించారు.

అయితే, టీమిండియా ఓటమికి కారణం ఏంటి? అనేది బయటపెట్టాడు మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప. ధోనీ టీమ్ వల్లే టీమిండియా ఘోర పరాజయం పాలైందని ఆరోపించాడు. దానికి సహేతుకమైన కారణాన్నీ వివరించాడు. ధోనీ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ దీనికి అసలు బాధ్యత అని తెలిపాడు. సీఎస్‌కే ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం వల్లే రోహిత్ సేన ఓడిపోయిందని వెల్లడించాడు. అదే సమయంలో సీఎస్కే యాజమాన్యంపై పలు ప్రశ్నలు సంధించాడు. దేశ ప్రయోజనాల కంటే తమ జట్టు ప్లేయర్లకే సీఎస్కే ప్రాధాన్యం ఇస్తోందని ఘాటు విమర్శలు చేశాడు.

అసలేం జరిగిందంటే.. భారత్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే కివీస్ ఆటగాడు రచిన రవీంద్రకు సీఎస్కే ఫ్రాంచైజీ ప్రాక్టీస్ అనుమతి ఇచ్చింది. దీంతో భారత పరిస్థితుల్లో ఎలా ఆడాలో రచిన్ నేర్చుకున్నాడు. సిరీస్ మొత్తం భారత స్పిన్నర్లపై ధాటిగా విజయవంతం భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీనిపైనే రాబిన్ ఊతప్ప అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ చానల్ ద్వారా.. టీమిండియా ఓటమిని విశ్లేషిస్తూ.. రచిన్‌కు అనుమతి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘సీఎస్కే అంటే నాకూ ఇష్టమే. కానీ, దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేటప్పుడు ఫ్రాంచైజీలు జాగ్రత్తగా వ్యవహరించాలి. తమ ఆటగాళ్ల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని తెలుసుకోవాలి. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. సీఎస్కే అకాడమీలో రచిన్‌ ప్రాక్టీస్ చేసి తొలి టెస్టులోనే సెంచరీ బాదాడు. అతడి భాగస్వామ్యంతో కివీస్ జట్టు విజయం సాధించింది. ఆ ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్ సిరీస్‌ను ఎగరేసుకుపోయింది’ అని ఊతప్ప పేర్కొన్నాడు.

ఊతప్ప వ్యాఖ్యలకు క్రికెట్ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు డబ్బు కోసం ఏదైనా చేస్తాయని, ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మనకు కూడా విదేశాల్లో లభిస్తాయా? అక్కడి క్రికెట్ సంఘాలు అందుకు ఒప్పుకుంటాయా? అని ప్రశ్నిస్తున్నారు. సీఎస్కే యాజమాన్యం చేసిన పనులతో భారత క్రికెట్ చరిత్రలోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్