ఈత కొలనులో రిషబ్‌పంత్‌ వాకింగ్‌.. వీడియో వైరల్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||స్విమ్మింగ్ పూల్‌లో పంత్ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: అదేంటి రిషబ్‌ పంత్‌ స్విమ్మింగ్‌ పూల్‌ నడవడమేంటి అనుకుంటున్నారా..! ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న పంత్‌ ఇప్పుడిప్పుడే తిరిగి అడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. ఇందులో భాగంగా పంత్‌ ఈత కొలనులో నడక ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. వైద్యుల సలహామేరకు పంత్‌.. ఊత కర్ర సాయంతో స్విమ్మింగ్‌ పూల్‌లో నడుస్తున్నాడు. దీనికి సంబంధించి వీడియోను పంత్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. గతంలో ఊత కర్ర సాయంతో అడుగులు వేస్తూ.. చిన్న చిన్న విషయాలు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి అని రాసుకొచ్చిన పంత్‌.. తాజా వీడియోకు కూడా ఆసక్తికరమైన వ్యాఖ్య జోడించాడు. ‘చిన్నా, పెద్ద ప్రతి విషయానికి కృతజ్ఞతలు’ అని పోస్ట్‌ చేశాడు. గతేడాది డిసెంబర్‌లో పంత్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నూతన సంవత్సర వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి ఉత్తరఖండ్‌కు కారులో బయల్దేరిన పంత్‌ మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యాడు. రిషబ్‌ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడగా.. అటు నుంచి వస్తున్న బస్సు డ్రైవర్‌ ఇది గుర్తించి అతడిని కాపాడాడు. బస్సులోని కొందరు యువకులు అతడిని పంత్‌గా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఉత్తరాఖండ్‌ సీఎం కూడా పంత్‌ ఆరోగ్య పరిస్థితి ఆరా తీసి అతడికి మెరుగైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోగా.. ప్రత్యేక చికిత్స కోసం బీసీసీఐ అతడిని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా ముంబైకి తరలించింది. ఈ క్రమంలో పంత్‌కు ప్లాస్టిక్‌ సర్జరీతో పాటు.. కాలికి శస్త్రచికిత్స జరిగింది. ఇక అప్పటి నుంచి తిరిగి కోలుకుంటున్న పంత్‌.. చిన్న చిన్నగా నడక ప్రారంభించాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్‌లో ఉన్న పంత్‌.. తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నాడు. తాజాగా నడుము లోతు నీళ్లు ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో వాకింగ్‌ స్టిక్‌ సాయంతో నడుస్తున్న వీడియో రిషబ్‌ పంత్‌ షేర్‌ చేయగా.. దాన్ని బీసీసీఐ రీట్వీట్‌ చేసింది. ‘నీకు మరింత శక్తి చేకూరాలి చాంప్‌’ అని పేర్కొంది. 

పంత్‌ లేకుంటే కష్టమే.. 

ఆస్ట్రేలియాపై బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ చేజిక్కించుకున్న టీమిండియా.. జూన్‌ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించింది. స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో ఐసీసీ టైటిల్‌ కోసం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. స్వదేశంలో ఆసీస్‌తో సిరీస్‌లో పంత్‌ లేని లోటు పెద్దగా కనిపించకపోయినా.. డబ్లూ్యటీసీ ఫైనల్‌లో మాత్రం పంత్‌, బుమ్ర వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. పంత్‌ గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో వికెట్‌కీపర్‌గా బరిలోకి దిగిన తెలుగు ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అడపా దడపా షాట్లు కొట్టిన పంత్‌లా నిలకడగా పరుగులు రాబట్టలేకోయాడు. దీంతో రిషబ్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్