||సోఫియా డివైన్ Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: న్యూజిలాండ్ క్రికెటర్ సోఫియా డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. లారా వాల్వర్ట్ (68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆష్లే గార్డ్‌నర్ (41; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సోఫియా సునామీని తలపించింది. ఎడపెడా బౌండ్రీలతో మైదానంలో తుఫాన్ సృష్టించిన సోఫియా.. పరుగు తేడాతో డబ్లూ్యపీఎల్‌లో తొలి సెంచరీ చేసే అవకాశం చేజార్చుకుంది.
కోహ్లీ మాటలతో స్ఫూర్తి పొంది..
ఐపీఎల్లో 15 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. గత మ్యాచ్‌కు ముందు స్మృతి మంధన బృందంతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. అతడి మాటల నుంచి స్ఫూరతి పొందిన అమ్మాయిలు వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్నారు. నిరాశ దరిచేరనివ్వొద్దని.. పరాజయాలు ఎదురైనా బాధపడకుండా ముందుకు సాగాలని మహిళల జట్టుకు కోహ్లీ సూచించాడు. తెగించి ఆడితే విజయం తథ్యమని వారిలో ధైర్యం నింపాడు. ఆ మాటల నుంచి స్ఫూర్తి పొందిన బెంగళూరు.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఫుల్ జోష్ కనబర్చింది.
ముంబై ఇండియన్స్‌కు తొలి పరాజయం
మరోవైపు ముంబై ఇండియన్స్‌కు డబ్ల్యూపీఎల్‌లో తొలి పరాజయం ఎదురైంది. ఐదు విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ముంబై శనివారం తొలి పోరులో 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (35), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (25), ఇస్ వాంగ్ (32) మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. యూపీ బౌలర్లలో ఎకెల్‌స్టోన్ 3, దీప్తి, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 రన్స్ చేసింది. గ్రేస్ హారిస్ (39), తహిలా (38) రాణించారు. బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు.. కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగి జట్టుకు అవసరమైన పరుగులు చేసిన భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.