||రవీంద్ర జడేజా Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో ఘనత తన పేరిట రాసుకున్నాడు. అటు బంతితో ఫుల్ ఫాము.. ఇటు బ్యాట్‌తో కత్తి సాము చేస్తూ.. జట్టులో కీలక సభ్యుడిగా మారిన జడ్డూ.. దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ సరసన చేరాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు, 5 వేల పరుగులు చేసిన రెండో ఆల్‌రౌండర్‌గా జడ్డూ నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా జడేజా.. ఓవరాల్‌గా 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 171 మ్యాచ్‌లాడి 189 వికెట్లు పడగొట్టిన జడేజా.. 64 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 263 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మొత్తం కలిపి 503 వికెట్లతో నిలిచాడు.
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. టెస్టుల్లో 2619 పరుగులు చేసిన జడ్డూ.. వన్డేల్లో 2447, టీ20ల్లో 457 రన్స్ పూర్తి చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి జడేజా 5527 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో.. 1983లో భారత దేశానికి తొలి వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్‌దేవ్ ముందున్నాడు. టెస్టు, వన్డేల్లో కలిపి కపిల్ దేవ్ 687 వికెట్లు, 9031 పరుగులు సాధించి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. గాయం కారణంగా దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరమైన ఈ ఆల్‌రౌండర్.. పునరాగమనంలో దుమ్మురేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో గత రెండు టెస్టుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన జడ్డూ.. తాజా టెస్టులోనూ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోగా.. ఆ నాలుగూ జడేజానే పడగొట్టడం విశేషం.
జడేజా, కపిల్ కాకుండా అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు 5 వేల పరుగులు చేసిన ప్లేయర్లు
* జాక్వస్ కలీస్ 577 వికెట్లు 25,534 పరుగులు
* షాన్ పోలాక్ 829 వికెట్లు 7386 పరుగులు
* ఇమ్రాన్ ఖాన్ 544 వికెట్లు 7516 పరుగులు
* వసీం అక్రమ్ 916 వికెట్లు 6615 పరుగులు
* షాహిద్ అఫ్రిది 541 వికెట్లు 11,196 పరుగులు
* ఇయాన్ బోథమ్ 528 వికెట్లు 7313 పరుగులు
* చమింద వాస్ 755 వికెట్లు 5114 పరుగులు
* డానియల్ వెటోరీ 667 వికెట్లు 6989 పరుగులు
* షకీబ్ అల్ హసన్ 653 వికెట్లు, 13,445 పరుగులు