వరల్డ్‌ నంబర్‌వన్‌ అశ్విన్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ల జోరు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు సత్తాచాటారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో రాణించిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు కనబర్చారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 25 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్న స్టార్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ విభాగంలో నంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. గత వారం అశ్విన్‌తో కలిసి టాప్‌లో ఉన్న జేమ్స్‌ అండర్సన్‌ (859 పాయింట్లు) ప్రస్తుతం రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టాప్‌-10లో అశ్విన్‌తో పాటు భారత్‌ నుంచి జస్ప్రీత్‌ బుమ్రా (7వ ర్యాంక్‌), రవీంద్ర జడేజా (9వ ర్యాంక్‌) మాత్రమే ఉన్నారు. ప్యాట్‌ కమిన్స్‌ (841 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి అత్యుత్తమంగా రిషబ్‌ పంత్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న పంత్‌ 766 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (739 పాయింట్లు) పదో ర్యాంక్‌లో ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో మూడున్నరేండ్ల తర్వాత శతకం సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ఏడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరాడు. అహ్మదాబాద్‌ టెస్టులో భారీ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు. చివరి టెస్టులో సెంచరీ కొట్టిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 17 స్థానాలు మెరుగుపర్చుకొని 46వ ర్యాంక్‌కు చేరాడు. ఆస్ట్రేలియా వన్‌డౌన్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ (915 పాయింట్లు) టాప్‌లో ఉండగా.. స్టీవ్‌ స్మిత్‌ (872 పాయింట్లు), జో రూట్‌ (871 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. 

జడ్డూ నంబర్‌వన్‌ ర్యాంక్‌..

ఐసీసీ ఆల్‌రౌండర్‌ల విభాగంలో మనవాళ్లు దుమ్మురేపారు. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో సత్తాచాటిన భారత ఆల్‌రౌండర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపారు. నాలుగు మ్యాచ్‌ల్లోనూ అటు బ్యాట్‌తో ఇటు బంతితో ఆకట్టుకున్న జడేజా 431 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. మరో స్పిన్నర్‌ అశ్విన్‌ (359 పాయింట్లు) రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. యువ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (316 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరాడు. ఇక టీమ్‌విభాగంలో భారత్‌ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ సిరీస్‌ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాలనుకున్న టీమిండియాకు ఆ చాన్స్‌ దక్కలేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్‌ సేన 2-1తో గెలుచుకోగా.. శ్రీలంకపై తొలి టెస్టులో న్యూజిలాండ్‌ గెలుపొందడంతో డబ్లూ్యటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. చివరి టెస్టు ‘డ్రా’ కావడంతో తాజా ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ (119 పాయింట్లు) రెండో స్థానానికే పరిమితమైంది. సిరీస్‌ కోల్పోయినా.. ఆస్ట్రేలియా 122 పాయింట్లతో టాప్‌లో ఉంది. ఇంగ్లండ్‌ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (104 పాయింట్లు), న్యూజిలాండ్‌ (100 పాయింట్లు) ఆ తర్వాతి ర్యాంక్‌ల్లో ఉన్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్