వరుణుడి అంతరాయం.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతాపై పంజాబ్‌ గెలుపు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||కోల్‌కతాపై పంజాబ్ గెలుపు Photo: twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: అంతరాయాల మధ్య సాగిన పోరులో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించింది. మొదట ఫ్లడ్‌ లైట్ల సమస్యతో మ్యాచ్‌కు అరగంట అంతరాయం ఏర్పడగా.. అనంతరం మొహాలీలో భారీ వర్షం కురువడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి (డీఎల్‌ఎస్‌) ప్రకారం విజేతను నిర్ణయించారు. శనివారం జరిగిన పోరులో పంజాబ్‌ 7 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై విజయం సాధించింది. మొదట పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భానుక రాజపక్స (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (40; 6 ఫోర్లు) రాణించాడు. మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23), జితేశ్‌ శర్మ (21), సామ్‌ కరన్‌ (26 నాటౌట్‌), సికందర్‌ రజా (16) తలా కొన్ని పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. 

సికందర్‌ రజా, నాథన్‌ ఎలీస్‌ అరంగేట్రం.. 

ఈ మ్యాచ్‌ ద్వారా జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికందర్‌ రజాతో పాటు ఐర్లాండ్‌ ప్లేయర్‌ నాథన్‌ ఎలీస్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశారు. పంజాబ్‌ తరఫున బరిలోకి దిగిన వీరిద్దరూ తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించారు. తొలుత బ్యాటింగ్‌లో 16 పరుగులు చేసిన సికందర్‌.. బౌలింగ్‌లో ఓ వికెట్‌ పడగొట్టాడు. ఎలీస్‌కు బ్యాటింగ్‌ అవకాశం రాకపోగా.. బౌలింగ్‌లో ఓ వికెట్‌ తీశాడు. 

రస్సెల్‌ భయపెట్టినా.. 

భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులతో నిలిచిన సమయంలో భారీ వర్షం పడింది. అనంతరం తిరిగి మ్యాచ్‌ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం విజేతను నిర్ణయించారు. 16 ఓవర్లలో కోల్‌కతా 154 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ జట్టు మరో 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. విండీస్‌ విధ్వంసక బ్యాటర్‌ ఆండ్రూ రస్సెల్‌ (19 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతడి జోరు చూస్తుంటే.. కోల్‌కతా విజయం సాధించడం పక్కా అనిపించినా.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంజాబ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌.. అతడిని ఔట్‌ చేశాడు. దీంతో పంజాబ్‌ ఊపిరి పీల్చుకుంది. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (24), వెంకటేశ్‌ అయ్యర్‌ (34), రహ్మానుల్లా గుర్బాజ్‌ (22) తలా కొన్ని పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.  

కోహ్లీ సరసన శిఖర్‌ ధవన్‌

ఈ మ్యాచ్‌ ద్వారా పంజాబ్‌ కొత్త కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక అర్ధశతక భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్న ప్లేయర్‌గా విరాట్‌ కోహ్లీని సమం చేశాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కోహ్లీ ఇప్పటి వరకు 94 హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా.. ఇప్పుడు ధవన్‌ అతడిని సమం చేశాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్