||న్యూజిలాండ్ క్రికెట్ జట్టు Photo: Twitter||
ఈ వార్తలు, స్పోర్ట్స్ న్యూస్: జెంటిల్‌మెన్ గేమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రికెట్‌లో.. పోరాటపటిమకు మారుపేరైన న్యూజిలాండ్ మరో అద్భుతం ఆవిష్కరించింది. వన్డే, టీ20ల జోరులో ప్రభ తగ్గిపోతున్న టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపిరులూందింది. 146 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ‘ది బెస్ట్’ అనదగ్గ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. టెస్టు క్రికెట్‌కు భవిష్యత్తు లేదన్న వాళ్లకు కివీస్.. టెస్టు ఫార్మాట్‌లోని అసలు సిసలు మజాను రుచిచూపింది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. చివరి క్షణం వరకు పోరాటం వీడకూడదని చాటింది. ఈ క్రమంలో పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ హిస్టరీలో ఫాలోఆన్‌లో నుంచి కోలుకొని విజయం సాధించిన మూడో జట్టుగా చరిత్రకెక్కింది. గతంలో ఇంగ్లండ్, భారత్ మాత్రమే ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు న్యూజిలాండ్ ఆ జాబితాలో చేరింది. ఒక పరుగు తేడాతో టెస్టు గెలిచిన రెండో జట్టుగానూ రికార్డు నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ పరుగు తేడాతో గెలిచింది. మొదట ఇంగ్లండ్.. 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం న్యూజిలాండ్ 209 పరుగులకు ఆలౌటైంది. భారీ ఆధిక్యం మూటగట్టుకున్న ఇంగ్లండ్.. ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించగా.. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన కివీస్ ఆటగాళ్లు.. ఈసారి దుమ్మురేపారు. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సెంచరీతో చెలరేగగా.. తక్కినవాళ్లు రాణించారు. దీంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేసింది. ఇక 258 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. చివరకు 256 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్ (95) ఒక్కడే పోరాడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నర్ 4, కెప్టెన్ టిమ్ సౌథీ 3 వికెట్లు పడగొట్టారు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. కేన్ విలియమ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమం అనదగ్గ కోల్‌కతా (2001) టెస్టుకు.. తాజా మ్యాచ్‌కు చాలా సారూప్యతలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియాపై అద్వితీయ విజయంతో భారత క్రికెట్‌లో కొత్త జోష్ నింపిన గంగూలీ సేన ఘనతను ఓ సారి గుర్తు చేసుకుంటే..
ఈడెన్‌లో ఇదే తరహా..
క్రికెట్ జగత్తును ఆస్ట్రేలియా ఏలుతున్న కాలంలో యువ ఆటగాళ్లతో నిండిన భారత జట్టు.. ఆసీస్‌కు భారీ షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు 2001లో భారత్‌లో అడుగుపెట్టిన కంగారూలు.. తొలి మ్యాచ్ నెగ్గి మంచి జోష్‌లో ఉన్నారు. మార్చి 11 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. టర్బొనేటర్ హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ నమోదు చేసుకున్నా.. కంగారూలు భారీ స్కోరు చేశారు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 171 రన్స్‌కే కుప్పకూలింది. వీవీఎస్ లక్ష్మణ్ (59) టాప్ స్కోరర్ కాగా.. శివ్ సుందర్ దాస్ (20), రమేశ్ (0), రాహుల్ ద్రవిడ్ (25), సచిన్ టెండూల్కర్ (10), సౌరవ్ గంగూలీ (23), నయన్ మోంగియా (2) విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల ఆధిక్యం దక్కడంతో ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌వా.. టీమిండియాను ఫాలోఆన్ ఆడేందుకు ఆహ్వానించాడు. అక్కడే భారత క్రికెట్ చరిత్రకు కొత్త పునాది పడినౖట్లెంది. తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనవాళ్లు.. రెండో ఇన్నింగ్స్‌లో గొప్ప పోరాట పటిమ కనబర్చారు. వీవీఎస్ లక్ష్మణ్ (452 బంతుల్లో 281; 44 ఫోర్లు) భారీ ద్విశతకంతో కదంతొక్కగా.. రాహుల్ ద్రవిడ్ (353 బంతుల్లో 180; 20 ఫోర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ధాటితో భారత్ 657/7 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం 384 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 212 పరుగులకు ఆలౌటైంది. హర్భజన్ 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత చరిత్ర తిరగరాస్తూ ఫాలోఆన్ నుంచి కోలుకొని టెస్టు మ్యాచ్ నెగ్గిన రెండో జట్టుగా నిలిచింది.