జోకోవిచ్ రికార్డు.. ఖాతాలో 10వ ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| జకోవిచ్ 22వ గ్రాండ్ స్లామ్, Photo: Twitter ||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు. అచ్చొచ్చిన మైదానంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్న జొకోవిచ్‌ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (22) నెగ్గిన ప్లేయర్‌గా రఫేల్‌ నాదల్‌ (స్పెయిన్‌)ను సమం చేశాడు. రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదికగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ జొకోవిచ్‌ 6-3, 7-6 (7/4), 7-6 (7/5)తో స్టిఫనోస్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన తుదిపోరులో తొలి సెట్‌ను సునాయాసంగానే నెగ్గిన జొకోవిచ్‌.. ఆ తర్వాత చేమటోడ్చాల్సి వచ్చింది. చివరి రెండు సెట్‌లు టై బ్రేకర్‌కు వెళ్లగా.. కీలక సమయాల్లో బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో రెచ్చిపోయిన జొకో మ్యాచ్‌ను తనదైన శైలిలో ముగించాడు. ఫైనల్‌ చేరే క్రమంలో కేవలం ఒక్క సెట్‌ మాత్రమే కోల్పోయిన సెర్బియా స్టార్‌.. ఓవారల్‌గా కెరీర్‌ 93వ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు. 


ఫైనల్‌ చేరాడిలా..

తొలి రౌండ్‌: రాబర్టో కార్బెల్స్‌ (స్పెయిన్‌)పై 6-3, 6-4, 6-0తో విజయం

రెండో రౌండ్‌: ఎన్జో కొకార్డ్‌ (ఫ్రాన్స్‌)పై 6-1, 6-7 (5/7), 6-2, 6-0తో గెలుపు

మూడో రౌండ్‌: దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై 7-6 (7/5), 6-3, 6-4తో జయభేరి

ప్రిక్వార్టర్స్‌: అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా)పై 6-2, 6-1, 6-2తో విజయం

క్వార్టర్‌ ఫైనల్‌: రూబ్లేవ్‌ (రష్యా) 6-1, 6-2, 6-4తో గెలుపు

సెమీఫైనల్‌: టామీ పాల్‌ (అమెరికా) 7-5, 6-1, 6-2తో జయకేతనం


ఇక్కడే ఆరంభం..!

2008లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన జొకోవిచ్‌.. ఆ తర్వాత 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023లో విజేతగా నిలిచాడు. గతేడాది కరోనా వ్యాక్సిన్‌ సమాచారం ఇవ్వనందుకు గానూ నిర్వాహకులు జొకోవిచ్‌ను ఆస్ట్రేలియా ఓపెన్‌కు అనుమతించకపోగా.. ఈ సారి మాత్రం నొవాక్‌ తన ఆట పదునేంటో చాటాడు. వింబుల్డన్‌లో 7  (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022), యూఎస్‌ ఓపెన్‌లో 3 (2011, 2015, 2018), ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 2 (2016, 2021) టైటిల్స్‌ నెగ్గిన 35 ఏండ్ల జొకో.. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ గెలిస్తే మైదానంలోని గడ్డి తింటూ అభిమానులను అలరించే నొవాక్‌.. ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌ కొనసాగిస్తే.. మరో నాలుగైదు గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గడం పెద్ద కష్టమేం కాదు. ప్రధాన పోటీదారులైన రోజర్‌ ఫెదరర్‌ ఇప్పటికే కెరీర్‌కు వీడ్కోలు పలికేయగా.. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌ గాయాలతో సతమతమవుతున్నాడు. ఇలాంటి తరుణంలో జొకోకు ఎదురు నిలిచే కొత్త ఆటగాడు ఎవరొస్తారో చూడాలి! 


జొకోవిచ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌: 10 (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023)

ఫ్రెంచ్‌ ఓపెన్‌: 2 (2016, 2021)

వింబుల్డన్‌: 7 (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022)

యూఎస్‌ ఓపెన్‌: 3 (2011, 2015, 2018)


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్