NZ vs SL | ఇది కదా టెస్టు మ్యాచ్‌ అంటే..ఉత్కంఠ పోరులో చివరి బంతికి శ్రీలంకపై న్యూజిలాండ్‌ గెలుపు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||శ్రీలంకపై న్యూజిలాండ్ చారిత్రక గెలుపు||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: టెస్టు మ్యాచ్‌ల్లో మజా తగ్గిపోతోంది.. రాను రాను సుదీర్ఘ ఫార్మాట్‌ మీద ఆసక్తి సన్నగిల్లుతోంది అంటున్న వాళ్లకు న్యూజిలాండ్‌, శ్రీలంక తొలి టెస్టు అదిరిపోయే బదులిచ్చింది. ఐదు రోజుల పాటు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆఖరి రోజు వరుణుడు విచ్చేసినా.. మ్యాచ్‌లో ఫలితం తేలింది. వర్షం కారణంగా దాదాపు రెండు సెషన్‌ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. న్యూజిలాండ్‌ అద్వితీయ పోరాటంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. జెంటిల్మన్‌ క్రికెట్‌లో పోరాటానికి మారుపేరైన న్యూజిలాండ్‌.. మరోసారి విశ్వరూపం కనబర్చింది. సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కివీస్‌ అదిరిపోయే బోణీ కొట్టింది.

పరిస్థితులు బౌలర్లకు సహకరిస్తున్నా.. మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అదిరిపోయే సెంచరీ బాదాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ చరిత్రలోనే చిరకాలం గుర్తుండిపోయేలా సాగిన పోరులో చివరకు న్యూజిలాండ్‌ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇటీవల ఇంగ్లండ్‌తో ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌.. తాజా మ్యాచ్‌లో చివరి బంతికి పరుగుతీసి గట్టెక్కింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0తో ఆధిక్యం సాధించింది. ఈ పరాజయంతో శ్రీలంక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌ ఆశలు గల్లంతయ్యాయి. 

పోరాట యోధుడు..

285 పరుగుల టార్గెట్‌ చేజింగ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 28/1తో సోమవారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ చివరకు 8 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (121 నాటౌట్‌; 11 ఫోర్లు, ఒక సిక్సర్‌) అజేయ సెంచరీతో చివరి వరకు క్రీజులో నిలువగా.. డారిల్‌ మిషెల్‌ (81; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. ఏడు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన విలియమ్సన్‌ గొప్ప సంయమనం పాటించాడు. లాథమ్‌ (24), కాన్వే (5) హెన్రీ నికోల్స్‌ (20) ఎక్కువసేపు నిలువలేకపోయినా.. డారిల్‌ మిషెల్‌ సహకారంతో విలియమ్సన్‌ జట్టును విజయానికి చేరువ చేశాడు. ఇక కివీస్‌ విజయం ఖాయమే అనుకుంటున్న తరుణంలో మిషెల్‌ ఔట్‌ కాగా.. బ్లండెల్‌ (3), బ్రాస్‌వెల్‌ (10), కెప్టెన్‌ టిమ్‌ సౌథీ (1) మ్యాట్‌ హెన్రీ (4) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

దీంతో కివీస్‌ విజయంపై నీలినీడలు కమ్ముకోగా.. ఇలాంటి ఎన్నో హోరాహోరీ మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించిన అనుభవమున్న విలియమ్సన్‌.. తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టిలేపాడు. చివరి ఓవర్‌ చివరి బంతికి లెగ్‌ బై రూపంలో సింగిల్‌ తీయడం ద్వారా ఈ మ్యాచ్‌లో లంక విజయతీరాలు చేరింది. లంక బౌలర్లలో అసిత 3, ప్రభాత్‌ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టారు. డారిల్‌ మిషెల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఒకవైపు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో నాలుగో టెస్టు నిర్జీవమైన పిచ్‌ కారణంగా ‘డ్రా’గా ముగియగా.. న్యూజిలాండ్‌, లంక పోరు మాత్రం టెస్టు మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను అందించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్