||ఇద్దరు మిషెల్‌ల దెబ్బకు టీమిండియా బెంబేలు Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: బౌలింగ్‌లో మిషెల్ స్టార్క్, బ్యాటింగ్‌లో మిషెల్ మార్ష్ దెబ్బకు టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం వైజాగ్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. గత రెండు దశాబ్దాల్లో ఆసీస్‌పై టీమ్‌ఇండియాకు ఇది అత్యల్ప స్కోరు. విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్ కాగా.. అక్షర్ పటేల్ (29 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్ (5/53) ధాటికి టీమ్‌ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (0), కెప్టెన్ రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (0), కేఎల్ రాహుల్ (9), హార్దిక్ పాండ్యా (1), రవీంద్ర జడేజా (16) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో అబాట్ 3, ఎలీస్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిషెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టారు. వీరిద్దరూ తొలి బంతి నుంచే విరుచుకుపడటంతో ఆసీస్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఒక్కరైనా నిలువలేక..
అచ్చం గత వన్డేలోలాగే భారత టాపార్డర్ మరోసారి నిరాశ పరిచింది. తొలి ఓవర్ మూడో బంతికే గిల్ ఔట్ కాగా.. ఐదో ఓవర్‌లో టీమ్‌ఇండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి వన్డేకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్.. స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇవ్వగా.. ముంబై మ్యాచ్ తరహాలోనే సూర్యకుమార్ మరోసారి సున్నా చుట్టాడు. ఈ సారి కూడా స్టార్క్ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తొలి వన్డే హీరో కేఎల్ రాహుల్ ఎక్కువసేపు నిలువలేకపోగా.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్లాడు. దీంతో రోహిత్ సేన 49 పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా.. తనకు బాగా కలిసొచ్చిన వైజాగ్ స్టేడియంలో కోహ్లీ పోరాటం కొనసాగించాడు. విరాట్ అండతో టీమ్‌ఇండియా పోరాడే స్కోరైనా చేస్తుందనుకుంటే.. అదీ సాధ్యపడలేదు. ఎలీస్ బౌలింగ్‌లో కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోగా.. జడేజా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ బ్యాట్‌కు పనిచెప్పడంతో భారత జట్టు వంద పరుగుల మార్క్‌ను దటగలిగింది. మ్యాచ్‌కు ముందు రోజు వైజాగ్‌లో భారీ వర్షం కురియడంతో పిచ్ పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాచిక పారింది. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన స్టార్క్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు.
కొట్టుడే కొట్టుడు..
ఇక స్వల్ప లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఆకాశమే హద్దుగా చెలరేగింది. గత మ్యాచ్‌లో సహచరులంతా వెనుదిరిగిన చోట.. బౌండ్రీలే లక్ష్యంగా విరుచుకుపడిన మిషెల్ మార్ష్ ఈ సారి అంతకుమించి విధ్వంసం సృష్టించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఉతికి ఆరేయడమే పనిగా పెట్టుకున్న మార్ష్ 6 ఫోర్లు, 6 సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించగా.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ అజేయ అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఓపెనర్ల ధాటికి మరో 234 బంతులు మిగిలుండగానే ఆసీస్ విజయం సాధించడం విశేషం.