మార్క్‌ వుడ్‌ పాంచ్‌ పటాకా.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ జయభేరి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||5 వికెట్లు తీసిన మార్క్ వుడ్ Photo: twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: గత ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతగడ్డపై ఆడిన తొలి పోరులో అదరిపోయే బోణీ కొట్టింది. విండీస్‌ ఆటగాళ్ల అండతో భారీ స్కోరు చేసిన లక్నో.. అనంతరం బౌలింగ్‌లోనూ సత్తాచాటింది. బ్యాటింగ్‌లో కరీబియన్‌ వీరులు కైల్‌ మయేర్స్‌, నికోలస్‌ పూరన్‌ దంచికొడితే.. బంతితో మార్క్‌ వుడ్‌ ఐదు వికెట్లతో ఢిల్లీ బ్యాటర్ల భరతం పట్టాడు. డబుల్‌ హెడర్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో లక్నో 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కైల్‌ మయేర్స్‌ (38 బంతుల్లో 73; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. ఆఖర్లో నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆయుష్‌ బదోని (7 బంతుల్లో 18; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) దంచికొట్టారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. 

కృష్ణప్ప ‘ఇంపాక్ట్‌’

లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఇన్నింగ్స్‌ చివరి బంతికి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్రీజులో అడుగుపెట్టిన కృష్ణప్ప గౌతమ్‌ భారీ సిక్సర్‌తో అలరించాడు. చివరి ఓవర్లలో నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోనీ భారీ షాట్లతో విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. కృష్ణప్ప గౌతమ్‌ తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. అనంతరం బౌలింగ్‌లోనూ తన కోటా పూర్తి చేసిన గౌతమ్‌.. వికెట్‌ పడగొట్టలేకపోయినా.. పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అమన్‌ హకీమ్‌ ఖాన్‌ ఆకట్టుకోలేకపోయాడు. కీలక దశలో క్రీజులో అడుగుపెట్టిన అమన్‌ నాలుగు పరుగులే చేసి నిరాశ పరిచాడు. 

వార్నర్‌ పోరాడినా.. 

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. పృథ్వీ షా (12), మిషెల్‌ మార్ష్‌ (0), సర్ఫరాజ్‌ ఖాన్‌ (4) విఫలంకాగా.. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (48 బంతుల్లో 56; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. రిలీ రొసో (30) రాణించాడు. లక్నో బౌలర్లలో వుడ్‌ 5 వికెట్లతో అదుర్స్‌ అనిపించుకోగా.. రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లీగ్‌లో ఆదివారం కూడా డబుల్‌ హెడర్‌ జరుగనుండగా.. తొలి పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రెండో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. ఉప్పల్‌ స్టేడియంలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్