KKR vs SRH : బ్రూక్‌ శివతాండవం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుచేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బ్రూక్ Photo: twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఆహా.. ఐపీఎల్‌ అంటే ఇది కదా! సీజన్‌లో ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన సన్‌రైజర్స్‌.. ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించింది. ఏమా కొట్టుడు.. స్టేడియం హోరెత్తిపోయేలా.. బౌలర్లు బెంబేలెత్తిపోయేలా.. అభిమానుల కరువు తీరిపోయేలా.. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ యంగ్‌ గన్‌ హ్యారీ బ్రూక్‌ అజేయ శతకంతో విజృంభించగా.. సారథి మార్క్‌రమ్‌ తన విలువ చాటుకున్నాడు. మిడిలార్డర్‌ కూడా రాణించడంతో కొండంత స్కోరు చేసిన హైదరాబాద్‌.. ఆనక బౌలింగ్‌లోనూ రాణించి కోల్‌కతాను కట్టడి చేసింది. ఫలితంగా శుక్రవారం జరిగిన పోరులో హైదరాబాద్‌ 23 పరుగుల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. మొదట సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ (55 బంతుల్లో 100 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కగా.. కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (26 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టాడు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), రింకూ సింగ్‌ (31 బంతుల్లో 58 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో మయాంక్‌ మార్కండే, మార్కో జాన్సెన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్రూక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

వేలంలో రూ. 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్‌ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్‌ మార్క్‌రమ్‌తో పాటు యువ ఆటగాడు అబిషేక్‌ శర్మ దుమ్మురేపారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఉమేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో మూడు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటిన బ్రూక్‌.. ఉమేశ్‌ తదుపరి ఓవర్‌లో రెండు సిక్సర్లు దంచాడు. ఒక ఎండ్‌లో బ్రూక్‌ ధాటిగా ఆడుతుంటే మరో ఎండ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (9), రాహుల్‌ త్రిపాఠి (9) నిరాశ పర్చారు. రస్సెల్‌ వేసిన ఐదో ఓవర్‌లో వీరిద్దరూ వెనుదిరిగారు. దీంతో పవర్‌ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి హైదరాబాద్‌ 65/2తో నిలిచింది.

మిడిల్‌ ఓవర్స్‌లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో పరుగుల రాబట్టడానికి ఇబ్బంది పడ్డ రైజర్స్‌ బ్యాటర్లు.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ క్రమంలో బ్రూక్‌ 55 బంతుల్లో ఐపీఎల్లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో 29 పరుగులే చేసి విమర్శలు ఎదుర్కొన్న బ్రూక్‌.. ఈ మ్యాచ్‌లో విశ్వరూపం కనబర్చి తనపై వెచ్చించిన మొత్తానికి న్యాయం చేశాడు.

వెబ్ స్టోరీస్