అత్యధిక పరుగుల వీరుడిగా విలియమ్సన్‌.. న్యూజిలాండ్‌ టెస్టు చరిత్రలో నయా మొనగాడు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||కేన్ విలియమ్సన్ Photo : Twitter||


ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: కట్‌, కవర్‌, స్ట్రెయిట్‌.. ఫ్రంట్‌ ఫుట్‌, బ్యాక్‌ ఫుట్‌.. పుల్‌, హుక్‌, స్వీప్‌, స్లాగ్‌ స్వీప్‌.. ఇలా క్రికెట్‌ పుస్తకాల్లోని అన్నీ షాట్లను అలవోకగా ఆడే.. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మరో ఘనత సృష్టించాడు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కివీస్‌ బ్యాటర్‌ టెస్టు క్రికెట్‌లో తమ దేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో వెల్లింగట్లన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఈ అరుదైన ఫీట్‌కు వేదికైంది. క్లిష్ట పరిస్థితుల్లోనే మెరుగ్గా రాణించే కేన్‌.. ఇంగ్లండ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో ఆణిముత్యం లాంటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఫాలోఆన్‌లో బరిలోకి దిగి అద్వితీయమైన ఆటతీరుతో శతక్కొట్టిన విలియమ్సన్‌ టెస్టు క్రికెట్‌లో 26వ సెంచరీ తన పేరిటి లిఖించుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాస్‌ టేలర్‌ను దాటి రికార్డుల్లోకెక్కాడు. 


న్యూజిలాండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

1. కేన్‌ విలియమ్సన్‌ 7787

2. రాస్‌ టేలర్‌ (7683) 

3. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (7172)

4. బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (6453)

5. మార్టిన్‌ క్రో (5444) 


మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా.. న్యూజిలాండ్‌ 209 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో నూజిలాండ్‌ ఫాలోఆన్‌ ఆడుతూ.. 483 పరుగుల భారీ స్కోరు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (282 బంతుల్లో 132; 12 ఫోర్లు) సూపర్‌ సెంచరీతో చెలరేగగా.. బ్లండెల్‌ (90), టామ్‌ లాథమ్‌ (83), కాన్వే (61), మిషెల్‌ (54) సత్తాచాటారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లీచ్‌ 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం 258 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. సోమవారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఇంగ్లిష్‌ జట్టు.. విజయానికి ఇంకా 210 పరుగులు చేయాల్సి ఉంది.  


కోహ్లీ కూడా కొడితేనే..!

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్న ఫ్యాబ్‌-4 (విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌)లో రూట్‌, విలియమ్సన్‌ వరుస సెంచరీలతో అదరగొడుతుండగా.. కోహ్లీ మాత్రం ఈ రేసులో వెనుకబడినట్లు కనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో కలిపి) అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ 100 శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. విరాట్‌ కోహ్లీ మాత్రమే అతడి దరిదాపుల్లో కనిపిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా మాత్రం కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడనే చెప్పాలి. మధ్యలో మూడేండ్ల పాటు ఒక్కసారి కూడా మూడంకెల స్కోరు నమోదు చేయలేకపోయిన భారత మాజీ కెప్టెన్‌.. ఇటీవల మూడు సెంచరీలు చేసినా.. విరాట్‌ స్థాయికి అవి తక్కువే అని చెప్పొచ్చు. మరోవైపు రూట్‌, విలియమ్సన్‌, స్మిత్‌ శతకాల మీద శతకాలు నమోదు చేస్తుంటే.. విరాట్‌ మాత్రం తిరిగి పుల్‌ ఫామ్‌ అందుకలోఏకపోతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ‘బోర్డర్‌-గవాస్కర్‌’ టెస్టు సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ ఒక్కసారి కూడా భారీ ఇన్నింగ్స్‌ నమోదు చేయలేకపోయాడు. బుధవారం నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌ వేదికగా.. మూడో టెస్టు ప్రారంభం కానుండగా.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఇండోర్‌లోనైనా కోహ్లీ దంచికొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్