ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ లభ్యతపై నెలకొన్న సందిగ్దత ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించిన జోష్ ఇంగ్లిస్.. ఇప్పుడు అదే జట్టుకు నమ్మకద్రోహం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ లభ్యతపై నెలకొన్న సందిగ్దత ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణించిన జోష్ ఇంగ్లిస్.. ఇప్పుడు అదే జట్టుకు నమ్మకద్రోహం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం రూ.8.6 కోట్ల భారీ ధర కోసం జోష్ ఇంగ్లిస్ పంజాబ్ యాజమాన్యాన్ని తప్పుదోవ పట్టించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026 రిటెన్షన్ ప్రక్రియ ముగియడానికి కేవలం 45 నిమిషాలకు ముందు ఇంగ్లిస్ ఓ మెయిల్ ద్వారా పంజాబ్ కింగ్స్ జట్టుకు షాకింగ్ సమాచారం ఇచ్చాడు. ఏప్రిల్ 18న తన వివాహం ఉందని, ఆ కారణంతో వచ్చే సీజన్‌లో కేవలం 4 మ్యాచ్‌లకు మాత్రమే తాను అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. పూర్తి సీజన్ ఆడే ప్లేయర్ కావాలని కోరుకున్న పంజాబ్ కింగ్స్.. ఇంగ్లిస్ మాటలను నమ్మి అతడిని వేలంలోకి వదిలేయక తప్పలేదు. అయితే డిసెంబర్ 16న అబుదాబిలో జరిగిన వేలంలో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. కేవలం 4 మ్యాచ్‌లే అందుబాటులో ఉంటాడని తెలిసి కూడా లక్నో సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జోష్ ఇంగ్లిస్ కోసం హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు లక్నో జట్టు రూ.8.6 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. ఓ ప్లేయర్ కేవలం 4 మ్యాచ్‌లకే అందుబాటులో ఉంటే ఇతర జట్లు అంత భారీ ధర ఎందుకు చెల్లిస్తాయనేది పంజాబ్ కింగ్స్ యాజమాన్యాన్ని కలచివేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే.. లక్నో, హైదరాబాద్ ఫ్రాంచైజీలకు జోష్ ఇంగ్లిస్ లభ్యతపై ముందే పూర్తి స్పష్టత ఉన్నట్లు సమాచారం. ఆ రెండు జట్ల కోచ్‌లు (జస్టిన్ లాంగర్, డానియల్ వెట్టోరి) ఆస్ట్రేలియా క్రికెట్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన వారు కావడంతో, ఇంగ్లిస్ తన పెళ్లి తర్వాత హనీమూన్‌ను వాయిదా వేసుకుని మరీ ఐపీఎల్ ఆడతాడనే విషయం వారికి ముందే తెలుసని పంజాబ్ భావిస్తోంది. వేలం ముగిసిన తర్వాత ఇంగ్లిస్ తన ప్లాన్స్ మార్చుకోవడం పంజాబ్ యజమాని నెస్ వాడియాకు ఆగ్రహం తెప్పించింది.