Jonty Rhodes | భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ ?

ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న జాంటీ రోడ్స్.. టీ. దిలీప్ స్థానంలో బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

jonty rhodes

జాంటీ రోడ్స్ Photo: Instagram

న్యూఢిల్లీ, ఈవార్తలు: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ‌ బాధ్యతలు చేపట్టనున్నారా? అంటే క్రికెట్ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న జాంటీ రోడ్స్.. టీ. దిలీప్ స్థానంలో బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీని గురించి బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చర్చ కూడా జరిగినట్లు తెలిసింది. మరోవైపు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. దీనిపై జూన్ చివరి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖత వ్యక్తం చేయకపోవటంతో బీసీసీఐ కొత్త కోచ్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి గంభీర్ దరఖాస్తు చేయకపోయినా, ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించారని గంభీర్‌ను బీసీసీఐ హెడ్ కోచ్ ప్రతిపాదనను తెచ్చినట్లు తెలిసింది.

అయితే, ముందు ఆ ప్రతిపాదనపై పెద్దగా దృష్టి సారించని గంభీర్.. తనదనంతర పరిస్థితుల్లో టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసేందుకు ఒప్పుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, అంతకుముందు గంభీర్, జాంటీ రోడ్స్ గతంలో కలిసి పనిచేశారు. వీరిద్దరు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌తో కలిసి పనిచేశారు. 2019లోనే జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆర్ శ్రీధర్‌నే కొనసాగించింది. కానీ, ఇప్పుడు జాంటీని ఆ పదవి వరించే అవకాశాలున్నాయి. అయితే, దిలీప్ కూడా ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. ఈ మధ్య మీడియాతో మాట్లాడిన దిలీప్.. తన పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగయ్యాయని వెల్లడించారు. బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడని పేర్కొన్నాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్