||సన్‌రైజర్స్ ఘోరాపరాజయం.. 72 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు Photo: twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లోనే కంగుతిన్నది. మూడేండ్ల తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. సమిష్టి వైఫల్యం కనబరుస్తూ నిరుటి రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. రాయల్స్ పరుగుల వరద పారించిన చోట రైజర్స్ కనీసం పోరాటపటిమ కనబర్చలేకపోయింది. ఆదివారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 203/5 స్కోరు చేసింది. కెప్టెన్ శాంసన్ (32 బంతుల్లో 55, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), బట్లర్ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం ఛేదనలో రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. బౌల్ట్ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లతో కోలుకోలేని దెబ్బతీస్తే.. చాహల్ మిగతా పని పూర్తి చేశాడు. అబ్దుల్ సమద్ (32) టాప్‌స్కోరర్ కాగ.. మిగిలినవాళ్లు ఘోరంగా నిరాశపరిచారు.
ఫస్ట్ బాల్ నుంచే పవర్ హిట్టింగ్..
మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు బట్లర్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సూపర్ ఫామ్‌మీదున్న జోస్ బట్లర్ ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రైజర్స్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో దుమ్మురేపాడు. మరో ఎండ్‌లో తానేం తక్కువ కాదన్నట్లు యశస్వి జైస్వాల్‌కు కూడా జత కలవడంతో రాయల్స్ స్కోరు రాకెట్ వేగాన్ని అందుకుంది. సుందర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో తొలి రెండు బంతులను భారీ సిక్స్‌లుగా మలిచిన బట్లర్ తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు దిగిన నటరాజన్‌ను అయితే బట్లర్ ఉతికి ఆరేశాడు. నాలుగు ఫోర్లతో తన బ్యాటింగ్ పవర్ ఏంటో రుచిచూపించాడు. ఈ క్రమంలో ఇరవై బంతుల్లోనే బట్లర్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే అదే దూకుడు కనబరిచే క్రమంలో బట్లర్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలోనే రాజస్థాన్‌కు పవర్‌ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. బట్లర్ ఔట్ తర్వాత స్కోరుబోర్డు ఒకింత మందగించినా యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ నిలకడ ప్రదర్శించారు.
ముఖ్యంగా జైస్వాల్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు ఆడపాదడపా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరిని విడదీసేందుకు భువీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే ఫారుఖీ వేసిన ఇన్నింగ్స్ పదమూడో ఓవర్లో యశస్వి.. మయాంక్ అగర్వాల్ క్యాచ్ ద్వారా వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక్కడి నుంచి రాయల్స్ జోరు ఒకింత తగ్గిపోయింది. శాంసన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సరైన సహకారం లేకపోయింది. దేవదుత్ పడిక్కల్ (2), రయాన్ పరాగ్ (7) ఇలా వచ్చి అలా వెళ్లారు. 48 పరుగుల తేడాతో రాయల్స్ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో హెట్‌మైర్ (22 నాటౌట్) దూకుడుగా ఆడటంతో రాయల్స్ రెండొందల మార్క్ అందుకుంది. ఇక చేదనలో రైజర్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి ఓవర్‌లో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి డకౌట్ కాగా.. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కోలుకోలేకపోయింది.