IPL 2023 | ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌ ఎవరితో ఎవరంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ఐపీఎల్ 2023 షెడ్యూల్ విడుదల Photo: Twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: బ్యాటర్ల హోరు.. బౌలర్ల జోరు.. ఫీల్డర్ల హుషారు.. ఇలా అభిమానులకు అంతులేని ఆనందాన్ని పంచే అతి పెద్ద క్రికెట్‌ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది వేసవిలో రెండు నెలల పాటు సాగే ఈ క్రికెట్‌ జాతర.. ఈ సారి కూడా వినోదాల విందు పంచేందుకు రెడీ అయింది. క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2023 (16వ సీజన్‌) షెడ్యూల్‌ విడుదలైంది. ఇప్పటి వరకు 15 సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా.. ఈసారి ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ సరికొత్తగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఐపీఎల్‌-2023వ సీజన్‌ మార్చి 31న ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో జరుగనున్న తొలి పోరులో చైన్నై సూపర్‌ కింగ్స్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది. శుక్రవారం లీగ్‌ ప్రారంభం కానుండగా.. ఆ వెంటనే వరుసగా రెండు రోజుల పాటు డబుల్‌ హెడర్స్‌ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. పది టీమ్‌ల సొంత వేదికలతో పాటు గువాహటి (రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో హోం గ్రౌండ్‌), ధర్మశాల (పంజాబ్‌ కింగ్స్‌ రెండో వేదిక)లోనూ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈసారి లీగ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ప్రవేశ పెట్టనుండటంతో ఐపీఎల్‌కు మరింత వన్నె పెరుగనుంది. 

ఒకదాని తర్వాత ఒకటి..

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు జరుగుతున్నా.. వాటిలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. ఇటీవల మహిళల కోసం ప్రత్యేకంగా లీగ్‌ నిర్వహించేందుకు వేలం చేపట్టగా.. దానికి కూడా విశేష స్పందన లభించింది. భారత్‌లో క్రికెట్‌ అభిమానులకు కొదవ లేకపోగా.. దాన్ని సొమ్ముచేసుకునేందుకు బీసీసీఐ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం భారత జట్టు.. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్‌-గవాస్కర్‌’ ట్రోఫీలో తలపడుతుండగా.. ఆ తర్వాత మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్లూ్యపీఎల్‌) ప్రారంభం కానుంది. అనంతరం ఐపీఎల్‌ను ప్లాన్‌ చేశారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించగా.. 52 రోజుల పాటు జరుగనున్న ఐపీఎల్లో మొత్తం 70 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సీజన్‌ మొత్తంలో 18 డబుల్‌ హెడర్స్‌ జరుగనుండగా.. మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానున్నాయి. డబుల్‌ హెడర్‌ ఉన్న రోజు తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. మే 28న ఐపీఎల్‌ ఫైనల్‌ నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు. 

ఇంటా, బయట మ్యాచ్‌లు

కొవిడ్‌-19 కారణంగా గత కొన్నాళ్లుగా ఈ లీగ్‌ను పరిమిత వేదికల్లోనే నిర్వహిస్తుండగా.. ఈసారి అందుకు భిన్నంగా పాత పద్దతిలో ఇంటా, బయటా విధానంలో జరుపనున్నారు. ప్రతి జట్టు సొంతగడ్డపై సగం మ్యాచ్‌లు.. మిగిలిన ఏడు మ్యాచ్‌లు వేర్వేరు వేదికలపై ఆడనుంది. దీంతో గత కొన్నాళ్లుగా క్రికెట్‌ పండుగను ఆస్వాదించలేకపోయిన భాగ్యనరగ వాసులు ఈ సారి సంబురాలు చేసుకోనున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడనున్న ఏడు మ్యాచ్‌లకు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఇందులో ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లకు అభిమానులు బ్రహ్మరథం పట్టడం ఖాయమే. హైదరాబాద్‌లో ఏప్రిల్‌-2 (ఆదివారం)న తొలి మ్యాచ్‌ జరుగనుంది. రాత్రి 7.30 నుంచి జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. ఆ తర్వాత వరుసగా ఏప్రిల్‌-9న  పంజాబ్‌ కింగ్స్‌తో,  ఏప్రిల్‌-18న  ముంబై ఇండియన్స్‌తో, ఏప్రిల్‌-24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే-4న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో, మే-13న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో, మే-18న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్