ఇద్దరూ ఇద్దరే.. దంచికొట్టిన కోహ్లీ, డుప్లెసిస్‌.. ముంబైపై బెంగళూరు జయభేరి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||దంచికొట్టిన కోహ్లీ, డుప్లెసిస్‌ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: సొంతగడ్డపై బెంగళూరు సింహనాదం చేసింది. ఓపెనర్లు భారీ అర్ధశతకాలతో విజృంభించడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఘనంగా బోణీ కొట్టింది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తెలంగాణ కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (46 బంతుల్లో 84 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ముంబై.. తొలి మ్యాచ్‌లోనూ అదే వరుస కొనసాగించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (1), ఇషాన్‌ కిషన్‌ (10), కామెరూన్‌ గ్రీన్‌ (5), సూర్యకుమార్‌ యాదవ్‌ (15) విఫలమవడంతో ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విండీస్‌ విధ్వంసక వీరుడు కీరన్‌ పొలార్డ్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావించి కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. స్టార్లంతా పెవిలియన్‌ బాటపట్టిన సమయంలో తిలక్‌ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. గత సీజన్‌లో కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడి ఆశలు రేపిన తెలుగు తేజం.. క్లిష్ట సమయంలో నాణ్యమైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. బెంగళూరు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నా.. ఏ మాత్రం ఇబ్బంది పడని తిలక్‌ వర్మ.. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే మిడిలార్డర్‌లో అతడికి సహకారం అందించే ఆటగాళ్లు లేని లోటు ఈ మ్యాచ్‌తో స్పష్టంగా కనిపించింది. చక్కటి క్రికెటింగ్‌ షాట్లతో అలరించిన తిలక్‌ వర్మ చివరి ఓవర్లలో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపాడు. తొలి మూడు ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ కోటా చివరి ఓవర్‌లో తిలక్‌ దంచికొట్టాడు. బెంగళూరు బౌలర్లలో కరణ్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, టాప్లీ, ఆకాశ్‌ దీప్‌, హర్షల్‌ పటేల్‌, బ్రాస్‌వెల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 

ఓపెనర్లు అదుర్స్‌

చిన్నస్వామి వంటి చిన్న స్టేడియంలో ముంబై నిర్దేశించిన లక్ష్యం పెద్దది కాకపోవడంతో బెంగళూరు సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఆర్సీబీ 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (49 బంతుల్లో 82; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), తాజా సారథి ఫాఫ్‌ డుప్లెసిస్‌ (43 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో బెంగళూరు అలవోకగా విజయ తీరాలకు చేరింది. ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీలో జాసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌, జొఫ్రా ఆర్చర్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకున్నా.. బెంగళూరు ప్లేయర్లను నిలువరించలేకపోయారు. ఆరంభంలో డుప్లెసిస్‌ దంచికొడుతుంటే.. అతడికి సహకరించిన కోహ్లీ.. ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పాడు. ఈ క్రమంలో డుప్లెసిస్‌ 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. కోహ్లీ 38 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. తొలి వికెట్‌కు 148 పరుగులు జోడించిన అనంతరం డుప్లెసిస్‌ ఔటైనా.. మ్యాక్స్‌వెల్‌ (3 బంతుల్లో 12 నాటౌట్‌; 2 సిక్సర్లు) అండతో కోహ్లీ మిగిలిన పని పూర్తిచేశాడు. విరాట్‌, డుప్లెసిస్‌ దూకుడుతో బెంగళూరు మరో 22 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. డుప్లెసిస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్