పంజాబ్‌ను గెలిపించిన కొత్త సారథి సామ్ కరణ్.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పోరాటం వృధా

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||సామ్ కరణ్ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ మూడో విజయం నమోదు చేసుకుంది. శిఖర్‌ ధవన్‌ అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు సామ్‌ కరన్‌ సారథ్యం వహించగా.. గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాల అనంతరం కోలుకొని కింగ్స్‌ గెలుపు బాట పట్టింది. డబుల్‌ హెడర్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 2 వికెట్ల తేడాతో లక్నోను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 74; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకం సాధించగా.. కైల్‌ మయేర్స్‌ (29; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించాడు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్‌ 3, కగిసో రబడ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 161పరుగులు చేసింది. సికందర్‌ రజా (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మాథ్యూ షార్ట్‌ (34; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) పోరాడగా.. ఆఖర్లో షారుక్‌ ఖాన్‌ (10 బంతుల్లో 23 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) కీలక పరుగులు సాధించాడు. లక్నో బౌలర్లలో యుధ్‌వీర్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, మార్క్‌ వుడ్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు.

రాహుల్‌ రాణించినా..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఇటీవలి కాలంలో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కేఎల్‌ రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. తాజా సీజన్‌లో తొలి అర్ధశతకం నమోదు చేసుకోవడంతో పాటు ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మొత్తంగా చూసుకుంటే రాహుల్‌ అర్ధశతకంతో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. అతడు గతంలో మాదిరి స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. పరుగు పరుగుకు ఇబ్బంది పడ్డాడు. ఒక వైపు మయేర్స్‌ సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. రాహుల్‌ స్ట్రయిక్‌ రొటేషన్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టాడు. తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం మయేర్స్‌ ఔట్‌ కాగా.. దీపక్‌ హుడా (2) నిరాశ పరిచాడు. కృనాల్‌ పాండ్యా (18) కాసేపు పోరాడగా.. విండీస్‌ బిగ్‌ హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌ (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరినీ రబడ వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడుఉ. ఈ రెండు క్యాచ్‌ షారుక్‌ ఖానే పట్టడం విశేషం. భారీ అంచనాల మధ్య క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టొయినిస్‌ (15, 2 సిక్సర్లు) రెండు భారీ సిక్సర్లతో అలరించినా.. ఎక్కువసేపు నిలువలేకపోగా.. స్కోరు పెంచే క్రమంలో రాహుల్‌ వెనుదిరిగాడు. ఆయుష్‌ బదానీ (5 నాటౌట్‌) ప్రభావం చూపలేకపోగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అడుగుపెట్టిన కృష్ణప్ప గౌతమ్‌ (1) ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా పంజాబ్‌ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 

షారుక్‌ మెరుపులు 

చేజింగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ మంచి ఆరంభం లభించలేదు. శిఖర్‌ ధవన్‌ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అథర్వ (0) డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (4) వైఫల్యాల పరంపర కొనసాగించాడు. మధ్యలో మాథ్యూ షార్ట్‌ (34), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (22) రాణించడంతో పంజాబ్‌ తిరిగి పోటీలోకి రాగా.. జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా ఆకట్టుకున్నాడు. ధవన్‌ స్థానంలో ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బంతితో మూడు వికెట్లు పడగొట్టినా.. బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. ఆరు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు. కేఎల్‌ రాహుల్‌ పట్టిన కండ్లు చెదిరే క్యాచ్‌కు జితేశ్‌ శర్మ (2) ఔట్‌ కాగా.. చివర్లో షారుక్‌ ఖాన్‌ మెరుపులు మెరిపించాడు.

వెబ్ స్టోరీస్