ధోనీ సిక్సర్లతో చెన్నై విజిల్‌ పొడు.. లక్నోపై సూపర్‌ కింగ్స్‌ ఘనవిజయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||లక్నోపై చెన్నై ఘన విజయం||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: చాన్నాళ్ల తర్వాత చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరిగిన పోరులో ధోనీ సేన అదరగొట్టింది. అశేష అభిమాన గణం ముందు మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ భారీ స్కోరు చేయగా.. అనంతరం బౌలింగ్‌లో మోయిన్‌ అలీ మ్యాజిక్‌ చేయడంతో ధోనీ సేన గెలుపు ‘విజిల్‌’ వేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆరంభం పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయం పాలైన చెన్నై.. సొంతగడ్డపై జరిగిన పోరులో విశ్వరూపం కనబర్చింది. సోమవారం చెన్నై 12 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (31 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో సత్తాచాటగా.. కాన్వే (29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్‌ దూబే (27; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) అంబటి రాయుడు (27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివరి ఓవర్‌లో క్రీజులోకి అడుగుపెట్టిన కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ.. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి మైదానాన్ని ఉర్రూతలూగించాడు. లక్నో బౌలర్లలో మార్క్‌ వుడ్‌, రవి బిష్ణోయ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్‌ కైల్‌ మయేర్స్‌ (22 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిలార్డర్‌ విఫలమవడంతో లక్నో లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. చెన్నై బౌలర్లలో మోయిన్‌ అలీ 4 వికెట్లు పడగొట్టాడు.  

స్టేడియంలో పూనకాలే..

నాలుగేండ్ల తర్వాత చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు మైదానానికి పోటెత్తారు. రుతురాజ్‌, కాన్వే తమ బాదుడుతో  ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. వీరిద్దరి ధాటికి స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించగా.. గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అల్లాడించిన లక్నో పేసర్‌ మార్క్‌వుడ్‌ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్లతో పాటు మధ్య ఓవర్లలో శివమ్‌ దూబే, అంబటి రాయుడు, మోయిన్‌ అలీ అదే దూకుడు కొనసాగించడం చెన్నైకి కలిసొచ్చింది. అంబటి రాయుడు ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. ఇక ఆఖరి ఓవర్‌లో మైదానంలోకి దిగిన ‘తలా’ ధోనీ.. అసలు సిసలు ఫినిషింగ్‌ పవర్‌ చాటాడు. మార్క్‌ వుడ్‌ వేసిన 20వ ఓవర్‌ రెండో బంతిని ఎదుర్కొన్న ధోనీ దాన్ని సూపర్‌ సిక్సర్‌గా మలిచాడు. మరుసటి బంతిని కూడా మహీ ప్రేక్షకుల్లో పడేయడంతో చెపాక్‌ స్టేడియం ధోనీ నామస్మరణతో మార్మోగిపోయింది.  

79/0 నుంచి.. 

ఛేదనలో లక్నోకు శుభారంభం దక్కింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (20) నెమ్మదిగా ఆడినా.. మరో ఎండ్‌లో మయేర్స్‌ విశ్వరూపం చూపాడు. గత మ్యాచ్‌లో ఎక్కడ ఆపాడో.. అక్కడి నుంచే దంచుడు ప్రారంభించాడు. దీంతో స్కోరు పరుగులు పెట్టింది. బౌలర్‌తో సంబంధం లేకుండా మయేర్స్‌ విజృంభించడంతో 5.2 ఓవర్లలోనే లక్నో వికెట్‌ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఈ దూకుడు చూస్తుంటే.. చెన్నై నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయేలా కనిపించినా.. మోయిన్‌ అలీ రాకతో మ్యాచ్‌ మారిపోయింది. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన అలీ.. కీలకమైన మయేర్స్‌, రాహుల్‌ తో పాటు కృనాల్‌ పాండ్యా (9), మార్కస్‌ స్టొయినిస్‌ (21)ను ఔట్‌ చేసి లక్నోను దెబ్బకొట్టాడు. ఇక అక్కడి నుంచి కోలుకోలేకపోయిన రాహుల్‌ సేన చివరకు లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్