చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers bengaluru) అదరగొట్టింది. చెన్నై సొంతగడ్డపై సీఎస్కే ఆటగాళ్లు తేలిపోయారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర మినహా మిగతా బ్యాటర్లు రాణించలేదు.
ఆర్సీబీ గెలుపు
ఈవార్తలు, చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers bengaluru) అదరగొట్టింది. చెన్నై సొంతగడ్డపై సీఎస్కే ఆటగాళ్లు తేలిపోయారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర మినహా మిగతా బ్యాటర్లు రాణించలేదు. తాజా విజయంతో చెన్నైలో బెంగళూరు 17 ఏళ్ల తర్వాత విజయం సాధించడం గమనార్హం. అదీ 50 పరుగుల భారీ తేడాతో. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (51) అర్ధశతకంతో చెలరేగాడు. ఓపెనర్లు సాల్ట్ (32), విరాట్ కోహ్లీ (31) శుభారంభాన్నిచ్చారు. అయితే, కోహ్లీ వన్డేల్లో ఆడినట్లు 30 బంతుల్లో 31 పరుగులు చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన పాటిదార్.. స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. చివర్లో టిమ్ డేవిడ్ (22) పరుగులు చేయడంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, పతిరన 2, ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. సీఎస్కే ఓపెనర్ రచిన్ రవీంద్ర (41) టాప్ స్కోరర్. త్రిపాఠి (5), రుతురాజ్ గైక్వాడ్ (0), దీపక్ హుడా (4), సామ్ కరన్ (8), దూబే (19), అశ్విన్ విఫలమయ్యారు. చివర్లో ధోనీ (30*), జడేజా (25) రాణించినా ఫలితం లేకుండాపోయింది. ఆర్సీబీ బౌలర్లలో హేజల్‌వుడ్ 3, యశ్‌దయాల్ 2, లివింగ్‌స్టోన్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశారు.
ధోనీ అద్భుత స్టంపింగ్
ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను ధోనీ అద్భుత స్టంప్ అవుట్ చేశాడు. గత మ్యాచ్‌లో 0.12 సెకనులో స్టంప్ చేయగా, ఈ మ్యాచ్‌లో 0.16 సెకనులో స్టంపింగ్ చేశాడు. దీంతో ధోనీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 40 ఏళ్ల వయసులోనూ ధోనీ ఆటలో పస తగ్గలేదని అభిమానులు పేర్కొంటున్నారు.