లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయాన్ని సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందుకుంది.
అశుతోష్ అద్భుత ఇన్నింగ్స్ Photo: Twitter
ఈవార్తలు, విశాఖపట్నం: లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయాన్ని సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు. మిచెల్ మార్ష్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72), నికోలస్ పూరన్(30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 75) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. నిర్ణీత ఓవర్లలో లక్నో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3/42) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేశ్ కుమార్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు.
మిచెల్ మార్ష్, పూరన్ విధ్వంసం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో.. తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. మిచెల్ మార్ష్ భారీ సిక్సర్లతో చెలరేగాడు. మార్క్‌రమ్ (15) ఔటైనా, పూరన్‌తో కలిసి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పవర్ ప్లేలోనే లక్నో 64/1 పరుగులు చేసింది. పోటాపోటీగా బౌండరీలు బాదిన నికోలస్ పూరన్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లక్నో 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ముఖేశ్ కుమార్ విడదీశాడు. మార్ష్‌ను పెవిలియన్ చేర్చాడుపంత్ డకౌటవ్వగా, పూరన్‌ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. దాంతో లక్నో పరుగుల వేగం తగ్గింది. చివర్లో మిల్లర్ (27 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో స్కోర్‌ను 200 ధాటించాడు.
ఆదిలో హడలెత్తించిన శార్దూల్ ఠాకూర్
209 పరుగుల ఛేదనలో శార్దూల్ ఠాకూర్ ఢిల్లీని హడలెత్తించాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(1), అభిషేక్ పొరెల్(0) వికెట్లు తీశాడు. ఆపై సిద్ధార్థ్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీ(4) వికెట్ కీపర్ పంత్ చేతికి దొరికిపోయాడు. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన కెప్టెన్ అక్షర్ పటేల్ (22) సైతం వెనుదిరగడంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. 6 ఓవర్లకు ఢిల్లీ 58 పరుగులు చేసింది. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్ రావడంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. ఒకవైపు టెయిలెండర్లు పెవిలియన్ చేరుతున్నా, పట్టు విడవలేదు. చివరి 12 బంతుల్లో 22 రన్స్ అవసరం కాగా కుల్దీప్ బౌండరీ కొట్టి.. తర్వాత బంతికి రనౌట్ అయ్యాడు. అయినా అశుతోష్ ఒత్తిడికి లోనవకుండా సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు.
