ఐపీఎల్2025 పరుగుల వరద పారుతోంది. ఒక్కో టీం తనకేం తక్కువ అన్నట్లు స్కోర్లను 200 దాటించేస్తున్నాయి. తాజాగా, పంజాబ్, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అభిమానులకు ఫుల్ మీల్స్ అందించింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేయగా, సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ పోరాడి ఓడింది.
శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్2025 పరుగుల వరద పారుతోంది. ఒక్కో టీం తనకేం తక్కువ అన్నట్లు స్కోర్లను 200 దాటించేస్తున్నాయి. తాజాగా, పంజాబ్, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అభిమానులకు ఫుల్ మీల్స్ అందించింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేయగా, సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ పోరాడి ఓడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపొందింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసి.. ఓటమి పాలైంది. చేధనలో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ (74, 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), గిల్ (33, 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బట్లర్ (54, 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుథర్‌ఫర్డ్ (46: 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా భారీ లక్ష్యం కావటంతో ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశారు.
చెలరేగి ఆడిన శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ముందుగా ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేసి, రబడా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. మరోవైపు.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతకం చేజార్చుకున్నాడు. 20వ ఓవర్‌లో బ్యాటింగ్ రాకపోవడంతో సెంచరీ చేయలేకపోయాడు. ఆఖర్లో శశాంక్ సింగ్ (44*; 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ప్రదర్శన చేశాడు. ఆఖరి ఓవర్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న శశాంక్ ఐదు ఫోర్లు కొట్టాడు. గుజరాత్ బౌలర్లలో సాయికిశోర్ 3 వికెట్లు, రబాడ, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
శ్రేయస్ చెప్పినందుకే స్ట్రైక్ ఇవ్వలేదు: శశాంక్ సింగ్
శ్రేయస్ అయ్యర్ సూచనల మేరకే తాను శ్రేయస్‌కు స్ట్రైక్ ఇవ్వలేదని శశాంక్ సింగ్ తెలిపాడు. ఆఖరి ఓవర్‌కు ముందే 97 పరుగులు చేసిన అయ్యర్.. శశాంక్ సింగ్ స్ట్రైక్ ఇవ్వకపోవడంతో మూడెంకల స్కోర్ అందుకోలేకపోయాడు. చివరి ఓవర్‌లో శశాంక్ సింగ్ ఐదు బౌండరీలు బాది 23 పరుగులు రాబట్టాడు. పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన శశాంక్.. శ్రేయస్ సెంచరీకి సహాకరించకపోవడానికి కారణాన్ని తెలిపాడు. అయ్యరే తన సెంచరీ కోసం కాకుండా స్వేచ్చగా షాట్స్ ఆడాలని సూచించాడని వివరించాడు. 'శ్రేయస్ బ్యాటింగ్ అద్భుతం. డగౌట్ నుంచి అతని బ్యాటింగ్ ముచ్చటగా అనిపించింది. నేను బ్యాటింగ్‌కు రాగానే శ్రేయస్ నాకు ఒక్కటే చెప్పాడు. తొలి బంతి నుంచి హిట్ చేయాలన్నాడు. తన సెంచరీ కోసం చూడకుండా స్వేచ్చగా షాట్స్ ఆడాలని సూచించాడు. దాంతో నేను బౌండరీలు కొట్టగలిగా’ అని పేర్కొన్నాడు.
