మన ఖాతాలో మరొకటి.. సిరీస్‌ నెగ్గిన టీమిండియా.. రెండో వన్డేలో లంక చిత్తు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


|| శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ విజయం Photo: Twitter || ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: స్వదేశంలో తిరుగులేని టీమిండియా.. మరో సిరీస్‌ కైవసం చేసుకుంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలుండగానే కప్పు చేజిక్కించుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో రోహిత్‌ సేన 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. గువాహటి వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో టాపార్డర్‌ దుమ్మురేపితే.. తాజా పోరులో మిడిలార్డర్‌ దంచికొట్టింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక నిర్ణీత ఓవర్లు ఆడలేకపోయింది. 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. తొలి వన్డేలో టాస్‌ నెగ్గి టీమిండియా బ్యాటింగ్‌ అప్పగించి పొరబాటు చేశామనుకున్న దసున్‌ షనక.. ఈసారి భారీ లక్ష్యాన్ని ఛేదించే బదులు మెరుగైన టార్గెట్‌ ఇవ్వాలని మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే తొలి ముగ్గురు ఆటగాళ్లు ఫర్వాలేదనిపించడంతో షనక నిర్ణయం సరైందే అనిపించింది. అంతర్జాతీయ స్థాయిలో తొలి వన్డే ఆడిన నువనిండు ఫెర్నాండో (50) అర్ధశతకంతో అదరగొట్టగా.. అవిష్క ఫెర్నాండో (20), కుషాల్‌ మెండిస్‌ (34) సత్తాచాటారు. దీంతో ఒక దశలో లంక 102/1తో పటిష్ట స్థితిలో కనిపించింది. అయితే కుల్దీప్‌ రాకతో లంకేయుల ఆటలకు అడ్డుకట్ట పడింది. చక్కటి గూగ్లీతో మెండిస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న కుల్దీప్‌.. ఆ తర్వాత చరిత అసలంక (15), షనక (2)ను కూడా బుట్టలో వేసుకున్నాడు. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ 3 వికెట్లతో సత్తాచాటడంతో లంక పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది. జమ్ము ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 


మిడిల్‌ మెరుపులు

సాధారణ లక్ష్యఛేదనలో ఆరంభం ఆకట్టుకోకపోయినా.. మిడిలార్డర్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్‌ ఘనవిజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా.. 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 రన్స్‌ చేసింది. వికెట కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (103 బంతుల్లో 64 నాటౌట్‌; 6 ఫోర్లు) అజేయ హాఫ్‌ సెంచరీతో చెలరేగగా.. వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (36), శ్రేయస్‌ అయ్యర్‌ (28) ఫర్వాలేదనిపించారు. గత మ్యాచ్‌ హీరోలు రోహిత్‌ శర్మ 917), శుభ్‌మన్‌ గిల్‌ (21), విరాట్‌ కోహ్లీ (4) ఎక్కువసేపు నిలువలేకపోయారు. లంక బౌలర్లలో లహిరు కుమార, చమిక కరుణరత్నె చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో చేజిక్కించుకోగా.. నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరుగనుంది. యుజ్వేంద్ర చాహల్‌ స్థానంలో టీమ్‌లో చోటు దక్కించుకున్న కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. అతడికి సిరాజ్‌, ఉమ్రాన్‌ అండగా నిలిచారు. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి మనవాళ్ల ఫీల్డింగ్‌ కూడా మెరుగ్గా కనిపించింది. 


అక్షర్‌ క్యాచ్‌ అదుర్స్‌

అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌తో ఇటీవలి కాలంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఈ మ్యాచ్‌లో అద్వితీయ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకుంటున్న అక్షర్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. లంక బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన ఇన్నింగ్స్‌ 34వ ఓవర్లో అక్షర్‌ అదిరిపోయే క్యాచ్‌ అందుకున్నాడు. చమిక కరుణరత్నె కొట్టిన షాట్‌ను పాయింట్‌లో అక్షర్‌ అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. ఎడమవైపు డైవ్‌ చేస్తూ బంతిని ఒడిసి పట్టిన అక్షర్‌.. జడ్డూకు తానే సరైన ప్రత్యామ్నాయం అని చాటాడు. బౌలింగ్‌లో 5 ఓవర్లు వేసి 16 పరుగులే ఇచ్చిన అక్షర్‌.. కీలకమైన ధనంజయ డిసిల్వ వికెట్‌ పడగొట్టాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్