|| 67 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం Photo: Twitter ||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్ : ఐసీసీ మెగాటోర్నీల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవుతున్న టీమ్‌ఇండియా ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. స్వదేశంలో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జట్టు పుష్కరకాలంగా మళ్లీ వరల్డ్‌కప్‌ను ముద్దాడలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలనే లక్ష్యంతో సాగుతున్న భారత జట్టు.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. లంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది ఆడిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. మంగళవారం గువాహటిలో జరిగిన పోరులో టీమ్‌ఇండియా 67 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 1-0తో సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, ఒక సిక్సర్) శతకంతో విజృంభించగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (83; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (70; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ ముగ్గురి ధాటితో భారత్ మరింత భారీ స్కోరు చేయడం ఖాయం అనిపించగా.. ఆఖర్లో ఒత్తిడి పెంచిన లంక బౌలర్లు చివరి పది ఓవర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆక్టుటకున్నారు. శ్రేయస్ అయ్యర్ (28; 3 ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (39; 4 ఫోర్లు, ఒక సిక్సర్), హార్దిక్ పాండ్యా (14) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టాడు.
షనక అజేయ సెంచరీ వృథా..
కొండంత లక్ష్యఛేదనలో లంకేయులకు శుభారంభం దక్కలేదు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ తన రెండో ఓవర్‌లోనే అవిష్క ఫెర్నాండో (5)ను బుట్టలో వేసుకోగా.. అతడి మరుసటి ఓవర్‌లో కుషాల్ మెండిస్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే జోరులో సిరాజ్ ఖాతాలో మరో వికెట్ పడేదే కానీ.. బ్యాటర్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ అందుకోవడంలో సిరాజ్ విఫలమయ్యాడు. ఈ దశలో నిషాంక (72) కాస్త పోరాడాడు. చరిత అసలంక (23), ధనంజయ డిసిల్వ (47)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. మిడిల్ ఓవర్లలో ఉమ్రాన్ మాలిక్ తన బుల్లెట్ వేగంతో విజృంభించడంతో లంకేయులు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. అయితే ఆశలే లేని స్థితిలో దసున్ షనక (88 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించిన షనక.. తాజా పోరులో అదే జోష్ కొనసాగించాడు. మరో ఎండ్‌లో వికెట్లు కోల్పోతున్నా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా.. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అభేద్యమైన తొమ్మిదో వికెట్‌కు కసున్ రజిత (9 నాటౌట్)తో కలిసి అతడు 100 పరుగులు జోడించాడంటే అతడి జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా కొనసాగగా.. ఐదో బంతిని కవర్స్ దిశగా బౌండ్రీ కొట్టిన షనక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరికి లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులకు పరిమితం కాగా.. భారత బౌలర్లలో ఉమ్రాన్ 3, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం కోల్‌కతాలో రెండో వన్డే జరుగనుంది.