|| శుభ్‌మన్ గిల్ Photo: Twitter ||
ఈ వార్తలు, స్పోర్ట్స్ న్యూస్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వీరవిహారం చేశాడు. ఇటీవల వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసుకున్న గిల్.. టీ20ల్లోనూ మూడంకెల స్కోరు తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ గర్జించడంతో న్యూజిలాండ్‌తో చివరి పోరులో భారత్ భారీ విజయాన్నందుకుంది. 168 పరుగుల తేడాతో చిత్తైన కివీస్ ఉత్తచేతులతో ఇంటిబాట పట్టగా.. సొంతగడ్డపై టీమిండియా మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది!
స్వదేశంలో తిరుగులేని జోరు కనబరుస్తున్న టీమిండియా.. మరో సిరీస్ ముద్దాడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 168 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించగా.. రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యుకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24; ఒక ఫోర్, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. శుభ్‌మన్‌కు టీ20ల్లో ఇదే తొలి శతకం కాగా.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన భారత ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, టిక్నర్, సోధి, డారిల్ మిషెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
66కే ఆలౌట్
అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిషెల్ (35; ఒక ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. అతడితో పాటు కెప్టెన్ మిషెల్ శాంట్నర్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత పేసర్ల ధాటికి కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్‌లో స్పిన్నర్లు సత్తాచాటితే ఈ సారి పేసర్లు ఆ బాధ్యత తీసుకున్నారు. బౌలింగ్ బృందాన్ని హార్దిక్ పాండ్యా ముందుండి నడిపించాడు. సారథి నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి తలా రెండు వికెట్లు పడగొట్టారు. వన్డే సిరీస్‌లో వైట్ వాష్‌కు గురైన న్యూజిలాండ్.. టీ20ల్లోనూ సిరీస్ కోల్పోయి స్వదేశానికి తిరుగుపయనమైంది. భారత్ తరఫున అతిపిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచిన శుభ్‌మన్ గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
*టీ20ల్లో భారత్‌కు పరుగుల పరంగా ఇదే (168) అతిపెద్ద విజయం. 2018లో ఐర్లాండ్‌పై సాధించిన (143 పరుగుల తేడాతో) గెలుపు రెండో స్థానంలో ఉంది.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా గిల్ (126) నిలిచాడు. విరాట్ (122*) రెండో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌పై ఓ ప్లేయర్ చేసిన అత్యదిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం.
*అత్యంత పినన్న వయసులో (23 ఏండ్లా 146 రోజులు) టీ20 సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. సురేశ్ రైనా (23 ఏండ్లా 156 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.
5-అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదిన ఐదో భారత ఆటగాడిగా గిల్ రికార్డుల్లోకెక్కాడు. సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ముందున్నారు.