||రోహిత్ శర్మ రికార్డు Photo: twitter ||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హిట్‌మ్యాన్.. టీ20, వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), ఫాఫ్ డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక) మాత్రమే ఈ ఫీట్ సాధించారు. రోహిత్ దంచికొట్టడంతో నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా నిర్వహిస్తున్న మొదటి టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) టెస్టు సెంచరీ నమోదు చేసుకోగా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (170 బంతుల్లో 66 బ్యాటింగ్; 9 ఫోర్లు), అక్షర్ పటేల్ (102 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
నైట్ వాచ్‌మన్‌గా క్రీజులో అడుగుపెట్టిన రవిచంద్రన్ అశ్విన్ (23) కాసేపు సారథికి సహకరించగా.. చేతశ్వర్ పుజారా (7), విరాట్ కోహ్లీ (12) విఫలమయ్యారు. అరంగేట్ర ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (8), కోన శ్రీకర్ భరత్ (8) ఎక్కువసేపు నిలువలేకపోయారు. రోహిత్ సేన స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకోవడం ఖాయమే అనుకుంటున్న తరుణంలో జడేజా, అక్షర్ పోరాడారు. గాయం నుంచి కోలుకొని ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన జడ్డూ చూడచక్కటి బ్యాటింగ్‌తో అలరించాడు. బౌలింగ్‌లో 5 వికెట్లు ఖాతాలో వేసుకున్న ఈ ఆల్‌రౌండర్ అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇక మరో ఎండ్ నుంచి అక్షర్ కూడా ధాటిగా ఆడటంతో రోహిత్ సేనకు 144 పరుగులు ఆధిక్యం దక్కింది. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మార్ఫే 5 వికెట్లు పడగొట్టాడు.
రెగ్యులర్ కెప్టెన్‌గా మూడు ఫార్మాట్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోహిత్ శర్మ బ్యాట్ నుంచి మరో అణిముత్యంలాంటి ఇన్నింగ్స్ జాలువారింది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ విఫలమైన చోట రోహిత్ తన విలువ చాటుకున్నాడు. నాగ్‌పూర్ టెస్టు తొలి రోజు ధాటిగా ఆడుతూ కంగారూలను కంగారు పెట్టిన హిట్‌మ్యాన్.. శుక్రవారం కాస్త సంయమనం కనబర్చాడు. ఏ చిన్న పొరపాటు చేసినా.. పుంజుకునేందుకు కాచుకు కూర్చున్న కంగారూలకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న కెప్టెన్.. చెత్త బంతులను శిక్షిస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. అతడికి జడేజా నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ క్యాచ్ మిస్ చేసి మంచి చాన్స్ ఇచ్చినా.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాసేపటికే కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్‌తో కలిసి జేడజా భారత్ ఆధిక్యాన్ని పెంచుతూ పోయాడు. టాపార్డర్‌ను సులువుగానే పడగొట్టిన ఆసీస్ బౌలర్లు.. ఈ జోడీని విడదీసేందుకు నానా తంటాలు పడ్డా ఫలితం లేకపోయింది. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 81 పరుగులు జోడించారు.