బ్యాటర్లపైనే భారం.. నాలుగో టెస్టులో ఖవాజా, గ్రీన్‌ సెంచరీలు..భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 36/0

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ఉస్మాన్ ఖవాజా Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాతో పాటు ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ సెంచరీలతో కదంతొక్కడంతో ‘బోర్డర్‌-గవాస్కర్‌’ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. చాన్నాళ్ల తర్వాత భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు సాధికారికంగా ఆడిం తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (422 బంతుల్లో 180; 21 ఫోర్లు) భారీ సెంచరీ చేయగా.. ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) టెస్టు కెరీర్‌లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ఆఖర్లో నాథన్‌ లియాన్‌ (96 బంతుల్లో 34; 6 ఫోర్లు), టాడ్‌ మార్ఫి (61 బంతుల్లో 41; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 6, మహమ్మద్‌ షమీ రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (17), శుభ్‌మన్‌ గిల్‌ (18) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్‌.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 444 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు చివర్లో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియాకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. తొలి రెండు రోజులు పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించిన అహ్మదాబాద్‌ పిచ్‌.. మూడో రోజు నుంచి స్పిన్‌కు మొగ్గుచూపే అవకాశం ఉండటం భారత్‌ను కాస్త కలవరపెడుతున్నది.

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు భారత్‌ తరఫున రోహిత్‌ ఒక్కడే సెంచరీ సాధించగా.. మిగిలిన వాళ్లెవరూ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై మనవాళ్లు ఎలా అడుతారనేది ఆసక్తికరం. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఖవాజా 10 గంటలకు పైగా క్రీజులో నిలిచి ఆసీస్‌కు భారీ స్కోరు అందించాడు. లియాన్‌, మార్ఫి కూడా ధాటిగా ఆడటాన్ని బట్టి చూస్తే.. పిచ్‌ నిర్జీవంగా ఉందని స్పష్టమవుతున్నది. మరి రోహిత్‌, గిల్‌, పుజారా, కోహ్లీ, శ్రేయస్‌, జడేజా, భరత్‌, అశ్విన్‌, అక్షర్‌తో కూడిన టీమ్‌ఇండియా ఎన్ని పరుగులు చేస్తుందో చూడాలి.

ఉస్మాన్‌, గ్రీన్‌ దంచుడే.. దంచుడు

తొలి రోజు కాస్త నెమ్మదిగా ఆడిన కంగారూలు.. శుక్రవారం ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ఓవర్‌నైట్‌ స్కోరు 255/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఉస్మాన్‌ ఖవాజా, గ్రీన్‌ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఉస్మాన్‌ ఆచితూచి ఆడుతుంటే.. గ్రీన్‌ మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు. ఐదో వికెట్‌కు 208 పరుగులు జోడించిన అనంతరం గ్రీన్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. అదే ఓవర్‌లో అలెక్స్‌ కారీ (0) కూడా వెనుదిరిగాడు. స్టార్క్‌ (6) ఎక్కువసేపు నిలువలేకపోగా.. డబుల్‌ సెంచరీ చేసేలా కనిపించిన ఉస్మాన్‌ ఖవాజాను చివరకు అక్షర్‌ పటేల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

రివ్యూ ద్వారా భారత్‌ ఈ వికెట్‌ సాధించింది. ఇంకేముంది మరికాసేపట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ముగియడం ఖాయమే అనుకుంటే.. ఆసీస్‌ స్పిన్నర్లు ఆఖర్లో పోరాట పటిమ కనబర్చారు. లియాన్‌, మార్ఫి స్పెషలిస్ట్‌ బ్యాటర్లను తలపిస్తూ.. పరుగులు రాబట్టారు. అశ్విన్‌ ఒక్కడే కాస్త ప్రభావం చూపగా.. మిగిలినవాళ్ల బౌలింగ్‌లో ఈ జోడీ సునాయాసంగా పరుగులు రాబట్టింది. తొమ్మిదో వికెట్‌కు వీరిద్దరూ 70 పరుగులు జోడించడంతో ఆసీస్‌ మరింత భారీ స్కోరు చేయగలిగింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్