అదరగొట్టిన అశ్విన్‌.. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. తొలి టెస్టులో ఘనవిజయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||టీమిండియా ఘన విజయం Photo: Twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విజయఢంకా మోగించింది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. ఫలితంగా ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యం సాధించడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించ దిశగా అడుగు ముందుకేసింది. భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు కుప్పకూలిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో మరీ ఘోరంగా 91 రన్స్‌కే పరిమితమైంది. మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (25) టాప్‌ స్కోరర్‌ కాగా.. భారత్‌ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 5, షమీ, జడేజా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు తీయడంతో పాటు 70 పరుగులతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి ఢిల్లీలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. 

స్పిన్‌ ఉచ్చులో విలవిల..

సుదీర్ఘ పర్యటనకు ముందు నిర్వహించే టూర్‌ మ్యాచ్‌ను వద్దనుకున్న ఆస్ట్రేలియా.. భారత్‌లో అడుగుపెట్టిందే తడువు స్పిన్‌ను ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. బెంగళూరులో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో దాదాపు వారం రోజుల పాటు స్పిన్‌పై కసరత్తు చేసింది. భారత టాప్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను పోలి ఉండే మహీశ్‌ పితియా బంతులను ఆడి ఆత్మవిశ్వాంసం ప్రొది చేసుకుంది. సర్వసన్నద్దమయ్యమని అనుకున్న అనంతరం నాగ్‌పూర్‌ అడుగుపెట్టిన ఆసీస్‌ మూడు రోజుల్లోనే చేతులెత్తేసింది. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆజట్టు కనీస ప్రతిఘటన కనబర్చలేకపోయింది. గత ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ ఆడిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 పరుగులకే ఆలౌటైన చందంగా.. నాగ్‌పూర్‌ రెండో ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబర్చింది. అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు మా వద్ద ప్రణాళికలు ఉన్నాయని ప్రగల్భాలు పలికిన కంగారూలు.. యాష్‌ బౌలింగ్‌ ధాటికి ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. స్టీవ్‌ స్మిత్‌ (25), డేవిడ్‌ వార్నర్‌ (10), లబుషేన్‌ (17), కారీ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. అశ్విన్‌ 5 వికెట్లతో ఆసీస్‌ను ఆల్లాడించగా.. మహమ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

అక్షర్‌ అదుర్స్‌.. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 321/7తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 400 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ఆకట్టుకోగా.. ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌ (174 బంతుల్లో 84; 10 ఫోర్లు, ఒక సిక్సర్‌), రవీంద్ర జడేజా (185 బంతుల్లో 70; 9 ఫోర్లు) రాణించారు. చివర్లో మహమ్మద్‌ షమీ (37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది. శనివారం జడేజా ఎక్కువసేపు నిలువలేకపోయినా.. అక్షర్‌, షమీ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో రోహిత్‌ సేనకు 223 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్‌ మార్ఫే 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్