నేడే భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డే.. రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తొలి వన్డేకు టీమిండియా సిద్ధం Photo: twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ.. ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. ఇక వన్డే వార్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ ఏడాది ఆఖర్లో భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్‌ కీలకంగా మారగా.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్‌కు భారత సారథి రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టును నడిపించనుండగా.. ఆఖరి టెస్టులో భారీ సెంచరీతో చెలరేగిన విరాట్‌ కోహ్లీ అదే జోరు పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ కొనసాగిస్తాడా చూడాలి!

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం వాంఖడేలో భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత ఉపఖండంలో మెగాటోర్నీ జరుగనున్న నేపథ్యంలో కంగారూలు ఈ సిరీస్‌ను రిహార్సల్స్‌గా భావిస్తుంటే.. గాయాలతో సతమతమవుతున్న భారత్‌ జట్టు కూర్పును చెక్‌ చేసుకోనుంది. టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆసీస్‌.. వన్డేల్లో మరింత బలంగా కనిపిస్తున్నది. కమిన్స్‌ ఈ సిరీస్‌కూ దూరం కాగా.. చివరి రెండు టెస్టుల్లో జట్టును నడిపించిన స్మిత్‌ వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.

గిల్‌, కోహ్లీపైనే ఆశలు..

భారత ఆటగాళ్లకు పనిభారం అనేది అసలు సమస్యే కాదని స్టాండిన్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ‘వర్క్‌లోడ్‌తో ఇబ్బంది అనేది కొందరి ఊహ మాత్రమే. ఆటగాళ్లకు దాంతో ఇబ్బందేం లేదు. గత కొన్ని సిరీస్‌లను గమనిస్తే.. భారత జట్టు దూకుడుగా ఆడుతున్నది. ఇప్పుడు కూడా దాన్నే కొనసాగిస్తాం. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రసవత్తర సమరాలు ఎదురైతే.. ఐసీసీ నాకౌట్స్‌ మ్యాచ్‌లకు అది పనికి వస్తుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడుడానికి ఇష్టపడతా. శ్రేయస్‌ అయ్యర్‌ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఆటగాళ్లన్నాక గాయాలు సహజం. ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఇలాంటి దశ ఎదురవుతుంది. దాన్ని దాటడం ముఖ్యం. భారత జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో నేను ఆడటం సాధ్యపడదు’ అని హార్దిక్‌ వివరించాడు.

ఇక భారత బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అదరగొడుతుండగా.. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో గిల్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌కు రానున్నాడు. గత ఆరు నెలల్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఐదు సెంచరీలతో మునుపటి ఫామ్‌ అందుకున్న విరాట్‌.. ఆసీస్‌పై అదే దూకుడు కొనసాగించాలని చూస్తున్నాడు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ చేయనున్నారు. రెండో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లో ఒకరిని ఎంపిక చేయనున్నారు. మహమ్మద్‌ సిరాజ్‌, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌ పేస్‌ బాధ్యతలు మోయనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆల్‌రౌండర్లతో నిండుగా ఉంది. మార్ష్‌, స్టోయినిస్‌, మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌ రూపంలో వారికి నలుగురు నాణ్యమైన ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్