రేణుక, స్మృతి పోరాటం వృథా.. టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళలకు పరాజయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||టీమిండియా పరాజయం Photo: Twitter||

ఈ వార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ప్రతిష్ఠాత్మక ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు ఇంగ్లండ్‌ షాకిచ్చింది. గత రెండు మ్యాచ్‌ల్లో చక్కటి విజయాలు నమోదు చేసుకున్న టీమిండియా.. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో 11 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. నటాలియా స్కీవర్‌ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), అమీ జోన్స్‌ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత పేసర్‌ రేణుకా సింగ్‌ 5 వికెట్లతో సత్తాచాటింది. అంతర్జాతీయ టీ20ల్లో రేణుకకు ఇవే అత్యుత్తమ గణాంకాలు. శిఖ పాండే, దీప్తి శర్మ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. రేణుకను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన ఇంగ్లండ్‌ ప్లేయర్లు.. మిగిలిన బౌలర్లను దంచికొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలోటీమ్‌ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. 

హ్యాట్రిక్‌ మిస్‌..

గత రెండు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనలో దుమ్మురేపిన భారత్‌.. ఈసారి సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేయలేకపోయింది. ఓపెనర్‌ స్మృతి మందన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), రిచా ఘోష్‌ (34 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. షఫాలీ వర్మ (8), జెమీమా రోడ్రిగ్స్‌ (13), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. ఆరంభం నుంచి ఆశించినంత వేగం లేకపోవడంతో చివర్లో లక్ష్యం కొండంతైంది. ఆఖరి ఓవర్‌లో భారత విజయానికి 31 పరుగులు అవసరం కాగా.. రిచా ఘోష్‌ భారీ షాట్లతో 19 రన్స్‌ రాబట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన హర్మన్‌ బృందం ఈ సారి గెలుపు గీత దాటలేకపోయింది. ఈ విజయంతో గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా.. సోమవారం జరుగనున్న పోరుల్లో ఐర్లాండ్‌తో భారత జట్టు తలపడనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్