Rohit Sharma | టీ20 కెప్టెన్సీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| రోహిత్ శర్మ Photo : Twitter ||

ఈవార్తలు, స్పోర్ట్స్: టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకునే ఆలోచన లేదని భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నుంచి రోహిత్‌ విశ్రాంతి తీసుకోవడంతో.. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ వరకు అతడు జట్టుతో ఉండడనే వాదనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ సోమవారం మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో ముఖ్యంగా 50 ఓవర్ల మ్యాచ్‌లపైనే దృష్టి పెట్టాం. మొత్తంగా టీమ్‌ఇండియా ఈ సీజన్‌లో ఎక్కువ టీ20లు ఆడటం లేదు. పనిభారాన్ని తగ్గించుకునేందుకే లంకతో సిరీస్‌కు దూరమయ్యా. ఐపీఎల్‌ తర్వాత కుర్రాళ్ల ప్రదర్శన ఎలా ఉందో గమనిస్తాం. ప్రస్తుతానికి పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పుకునే ఆలోచన లేదు’ అని అన్నాడు. 


ఇషాన్‌ను పక్కనపెట్టడం కష్టమైన నిర్ణయం

భారత్‌ ఆడిన చివరి వన్డేలో డబుల్‌ సెంచరీ (బంగ్లాదేశ్‌పై)తో విజృంభించిన యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడం బాధాకరమని అయితే ఇషాన్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడని రోహిత్‌ పేర్కొన్నాడు. వీరిద్దరిలో ఒకరినే ఎంపిక చేసుకునే అవకాశం ఉండటంతో అనుభవం, ఆటతీరు ఆధారంగా గిల్‌ వైపు మొగ్గు చూపినట్లు హిట్‌మ్యాన్‌ వెల్లడించాడు. వన్డేల్లో ద్విశతకం చేయడం చిన్న విషయం కాదని.. అలాంటి ఆటగాడికి తర్వాతి మ్యాచ్‌లో అవకాశం రాకపోవడం దురదృష్టమే అయినా.. కొన్ని సార్లు జట్టు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నాడు. మిడిలార్డర్‌ ఆటగాళ్ల ఎంపిక విషయంలోనూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సవాలు ఎదురవుతోందని పేర్కొన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌లో ఒకరినే ఆడించే అవకాశం ఉందని అన్నాడు. 


బుమ్రాకు మరింత రెస్ట్‌..

వెన్ను నొప్పి కారణంగా చాన్నాళ్లుగా జట్టుకు దూరమైన భారత ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ సిరీస్‌తో తిరిగి టీమ్‌లోకి వస్తాడనుకుంటే.. అది సాధ్యపడలేదు. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నా.. బిజీ షెడ్యూల్‌ కారణంగా రిస్క్‌ తీసుకోవద్దని బీసీసీఐ భావిస్తున్నది. ఈ నెల ఆరంభంలో బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైనట్లు పేర్కొన్న బోర్డు.. అతడికి మరింత విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో లంకతో సిరీస్‌కు ఎంపిక చేయలేదని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బుమ్రా బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడని బీసీసీఐ తెలిపింది. బుమ్రా గైర్హాజరీలో మహమ్మద్‌ షమీ, సిరాజ్‌ పేస్‌ బాధ్యతలు మోయనున్నారు. ఈ ఏడాది ఆఖర్లో భారత్‌ వేదికగా ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ జరుగనుండగా.. అందుకోసం టీమ్‌ఇండియా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం లంకతో గువాహటి వేదికగా భారత్‌ తొలి వన్డే ఆడనుంది.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్