|| హాకీ ప్రపంచకప్ Photo: twitter || ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: క్రికెట్‌ను మతంలా భావించే మనదేశంలో మరో ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. అదేంటి ఈ ఏడాది ఆఖర్లో కదా స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుంది అనుకుంటున్నారా.. మనం మాట్లాడుకునేది క్రికెట్ వరల్డ్ కప్ గురించి కాదండి.. హాకీ ప్రపంచకప్ గురించి. ఒకప్పుడు ప్రపంచ హాకీని కనుసన్నలతో ఏలిన భారత్.. దాదాపు అర శతాబ్దంగా ప్రపంచకప్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. 1975లో జరిగిన మూడో ప్రపంచకప్‌లో టైటిల్ నెగ్గిన భారత హాకీ జట్టు ఆ తర్వత ఒక్కసారి కూడా పోడియం దరిదాపుల్లోకి చేరలేకపోయింది. అంటే 48 ఏండ్లుగా మనవాళ్ల నిరీక్షణ కొనసాగుతోందన్నమాట. అయితే ఇటీవలి కాలంలో మన ఆట మెరుగవడం కాస్త ఊరటనిచ్చే అంశం కాగా.. శుక్రవారం ఒడిశా వేదికగా హాకీ వరల్డ్‌కప్‌నకు తెరలేవనుంది. 1971లో ఈ మెగాటోర్నీని ప్రవేశ పెట్టగా.. తొలిసారి భారత్ కాంస్యం పతకం కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1973లో జరిగిన వరల్డ్‌కప్‌లో రజతం నెగ్గిన టీమిండియా.. తదుపరి ఎడిషన్‌లో పతకం రంగు మార్చి స్వర్ణం చేజిక్కించుకుంది.
సొంతగడ్డపై వరుసగా రెండోసారి
1978 నుంచి మనవాళ్ల ఆటతీరు రోజురోజుకు తీసికట్టుగా మారగా.. అప్పటి నుంచి 2014 వరకు ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేకపోయింది. ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలన్నీ కొత్త తరహా ఆటతో ముందుకు దూసుకెళ్లగా.. టీమిండియా మాత్రం సంప్రాదాయ ఆటతీరునే పట్టుకొని వెనుకబడిపోయింది. అయితే గత కొన్నేళ్లుగా దేశంలో హాకీకి పూర్వ వైభవం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గడంతో పాటు.. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ.. అనధికారిక జాతీయ క్రీడకు ఇతోధిక సాయం చేస్తుండగా.. సొంతగడ్డపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మెగాటోర్నీలో సత్తాచాటేందుకు భారత్ సమాయత్తమవుతోంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలయికతో జట్టు బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్.. హెడ్ కోచ్ గ్రహమ్ రీడ్ శిక్షణలో ప్రపంచ స్థాయి జట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా రాటుదేలింది.
స్పెయిన్‌తో తొలిపోరు..
వరుసగా రెండోసారి స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో భారత జట్టు గ్రూప్-డి నుంచి బరిలోకి దిగనుంది. టోర్నీ ఆరంభ పోరులో స్పెయిన్‌తో తలపడనున్న టీమిండియా ఆ తరువాత వరుసగా ఇంగ్లండ్ (జనవరి 15), వేల్స్ (జనవరి 19)తో మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్ దశలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లోని జట్లు వర్గీకరణ మ్యాచ్‌ల ద్వారా ముందంజ వేయనున్నాయి. టోర్నీ ఆరంభానికి రెండు రోజుల ముందే (బుధవారం) బారాబతి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు జరుగగా.. భారత జట్టు ప్రపంచకప్ నెగ్గితే ఒక్కో ఆటగాడికి కోటి రూపాయాల నగదు పురస్కారం ఇస్తానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాటిచ్చారు. స్పెయిన్ కఠిన ప్రత్యర్థే అయినా.. హర్మన్‌ప్రీత్, మన్‌ప్రీత్, హార్దిక్, మన్‌దీప్, లలిత్ ఉపాధ్యాయ్, వివేక్ సాగర్ ప్రసాద్, పీఆర్ శ్రీజేశ్ కలిసి కట్టుగా రాణిస్తే.. భారత జట్టు విజయావకాశాలకు కొదవలేదు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా హాకీకి మంచి ఆదరణ లభిస్తుండటం టీమ్‌ఇండియాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వనుంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా మన వాళ్లకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పండి.