వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అతడికే జట్టు పగ్గాలు.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై సన్నీ ప్రశంసలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||హార్దిక్ పాండ్యా Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ అనంతరం స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను భారత జట్టు వన్డే కెప్టెన్‌గా చూడొచ్చని లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో హార్దిక్‌ పాండ్యా భారత జట్టును గెలిపిస్తే.. అతడిని భావి కెప్టెన్‌గా భావించొచ్చని సన్నీ జోస్యం చెప్పాడు. హార్దిక్‌ నాయకత్వ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని గవాస్కర్‌ పేర్కొన్నాడు. 29 ఏండ్ల పాండ్యా సారథ్య బాధ్యతలు అందుకున్న తొలిసారే గుజరాత్‌ టైటాన్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో భారత జట్టు 2-1తో విజయం సాధించగా.. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. వాంఖడే స్టేడియంలో జరుగనున్న తొలి వన్డేకు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్‌ దూరం కావడంతో ఆస్ట్రేలియాతో తొలి పోరుకు పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయపదాన నడిపితే.. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వొచ్చని గవాస్కర్‌ అన్నాడు. 

గత కొన్ని సిరీస్‌లుగా టీ20ల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న పాండ్యా.. చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, జస్ప్రీత్‌ బుమ్రా వంటి సీనియర్ల గైర్హాజరీలో జట్టు పగ్గాలు అందుకున్న పాండ్యా.. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో టీ20 సిరీస్‌లు గెలిపించాడు. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌లో కూడా జట్టును విజేతగా నిలిపాడు. దీంతో రోహిత్‌ వరసుడు పాండ్యానే అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గవాస్కర్‌ మాట్లాడుతూ.. ‘టీ20ల్లో జాతీయ జట్టుకు సారథ్యం వహించిన సమయంలో పాండ్యా నయకత్వ పటిమ ఆకట్టుకుంది. ఐపీఎల్లో అతడు గుజరాత్‌కు టైటిల్‌ అందించిన విషయం మరిచిపోకూడదు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అతడు టీమిండియాను గెలిపిస్తే.. పాండ్యాను భావి వన్డే కెప్టెన్‌గా చూడొచ్చు. 2023 వన్డే ప్రపంచకప్‌ అనంతరం సారథ్య బాధ్యతలు అప్పగించేయొచ్చు. మిడిలార్డర్‌లో పాండ్యా జట్టులో ప్రధాన ప్లేయర్‌. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున కూడా అతడు మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌ చేశాడు’ అని అన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరు మార్చుకోవడం అలవర్చుకున్న పాండ్యా.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడని గవాస్కర్‌ జోస్యం చెప్పాడు. బాధ్యతలు తీసుకునేందుక అతడు వెనుకాడడని అన్నాడు. ‘రెస్పాన్సిబులిటీ తీసుకునేందుకు అతడు సదా సిద్ధంగా ఉంటాడు. జట్టును ముందుండి నడిపించగలడని ఇప్పటికే రుజువైంది. తోటి ఆటగాళ్లకు అతడు భరోసా ఇస్తాడు. వారి సహజసిద్ధమైన ఆట ఆడేందుకు సహకరిస్తాడు’ అని గవాస్కర్‌ పేర్కొన్నాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్