IND vs AUS : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విరాట్‌ కోహ్లీ 59.. గిల్‌ సూపర్‌ సెంచరీ..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||విరాట్ కోహ్లీ Photo: Twitter||

ఈవార్తలు, స్పోర్ట్స్‌ న్యూస్‌: సుదీర్ఘ ఫార్మాట్‌లో చాన్నాళ్లుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడని టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. 14 నెలల తర్వాత టెస్టుల్లో హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మరోవైపు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌తో నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా దీటుగా బదులిస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగా.. మూడో రోజంతా బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన మూడు వికెట్లు కోల్పోయి మూడొందలకు చేరువైంది. నిర్జీవమైన పిచ్‌పై భారత బ్యాటర్లు సమిష్టిగా సత్తాచాటారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీతో కదంతొక్కగా.. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (128 బంతుల్లో 59 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (121 బంతుల్లో 42), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (35) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్‌, కునేమన్‌, మార్ఫి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న భారత్‌.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 191 పరుగులు వెనుకబడి ఉంది. కోహ్లీతో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (16) క్రీజులో ఉన్నాడు. 

గిల్‌ జిగేల్‌.. 

ఓవర్‌నైట్‌ స్కోరు 36/0తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన మనవాళ్లు.. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఒక ఎండ్‌ నుంచి గిల్‌ పరుగుల వరద పారిస్తే.. ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రోహిత్‌ శర్మ కునేమన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గిల్‌ కంగారూ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూంటే.. మరోవైపు ఆసీస్‌ ప్లేయర్లను పుజారా విసిగించాడు. ఈ క్రమంలో గిల్‌ 90 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించిన అనంతరం పుజారా మార్ఫి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే గిల్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతడికి విరాట్‌ కోహ్లీ జతవడంతో టీమ్‌ఇండియాకు తిరుగులేకుండా పోయింది. పిచ్‌ నుంచి చక్కటి సహకారం లభిస్తున్న చోట సీనియర్‌ బ్యాటర్లు కూడా ఇబ్బంది పడుతున్నా.. గిల్‌ మాత్రం తన క్లాస్‌ కొనసాగించాడు. వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను తప్పించి జట్టులో స్థానం దక్కించుకున్న గిల్‌ గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. అహ్మదాబాద్‌లో సూపర్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. చివర్లో బంతి కాస్త టర్న్‌ అవుతుండటంతో కోహ్లీ, జడేజా మరో వికెట్‌ పడకుండా రోజు ముగించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ మ్యాచ్‌ నెగ్గితే భారత్‌ 3-1తో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని చేజిక్కించుకోవడంతో పాటు.. డబ్లూ్యటీసీ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోనుంది. లేకపోతే.. న్యూజిలాండ్‌, శ్రీలంకతో సిరీస్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్