||డుప్లెసిస్, ధోనీ Photo: Twitter||
ఈవార్తలు, స్పోర్ట్స్ న్యూస్: ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ప్రశాంతంగా ఉంటూ.. ప్రత్యర్థికి అంతుచిక్కని వ్యూహాలు రచించడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మించినవాళ్లు లేరని.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. ఐపీఎల్లో ధోనీ సారథ్యంలో ఆడటం తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడిందని అతడు పేర్కొన్నాడు. కెరీర్ తొలినాళ్లలో గ్రేమ్ స్మిత్, స్టిఫెన్ ఫ్లెమింగ్, మహేంద్ర సింగ్ ధోనీని దగ్గరి నుంచి గమనించే అవకాశం దక్కడం తన అదృష్టమని.. వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని డుప్లెసిస్ పేర్కొన్నాడు. 2011-2015 వరకు, 2018 నుంచి 2021 వరకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్ గతేడాది నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్సీబీ పోడ్‌కాస్ట్‌తో డుప్లెసిస్ మాట్లాడుతూ.. తనకు ప్రారంభం నుంచి సారథ్యంపై ఉత్సుకత ఉందని.. అందుకే దిగ్గజాలను దగ్గర నుంచి గమనించేవాడిని అని పేర్కొన్నాడు.
దిగ్గజ సారథి గ్రేమ్ స్మిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఎంపికైన డుప్లెసిస్.. డ్రెస్సింగ్ రూమ్, టీమ్ మీటింగ్స్‌లో స్మిత్ మాటలకు మంత్రముగ్దుడైనట్లు పేర్కొన్నాడు. ‘జాతీయ జట్టుకు ఎంపికైన సమయంలో సఫారీ టీమ్‌కు దిగ్గజ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు. అప్పుడు అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడే విధానం నాపై చాలా ప్రభావం చూపింది. లీడర్ అంటే ఎలా ఉండాలో స్మిత్‌ను చూసి నేర్చుకున్న. అతడి మాటలు నాపై మంత్రాల్లా పనిచేసేవి. చెప్పాలనుకున్నదాన్ని ప్రభావవంతంగా వ్యక్తపర్చడంలో స్మిత్ ధిట్ట. అతడి వాక్చాతుర్యం నన్ను కట్టిపడేసేది. మైదానంలో ఆటతో పాటు అతడి మాటకు నేను ఫ్యాన్ అయిపోయా. అప్పటి నుంచే నాయకులను దగ్గర నుంచి పరిశీలించడం ప్రారంభించా. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చేరినప్పుడు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను గమనించా. న్యూజిలాండ్ తరఫునే కాక.. ప్రపంచలోనే అతడు గొప్ప సారథి అనడంలో సందేహం లేదు. అలాంటి వ్యక్తి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వనరులను వాడుకోవడం ఎలాగో అతడికి తెలిసినంత బాగా మరొకరి తెలియదేమో. తొలిసారి చెన్నై డ్రెస్సింగ్ రూమ్‌లో అడుగుపెట్టినప్పుడు ఫ్లెమింగ్ పక్కనే కూర్చున్నా. సారథ్యానికి సంబంధించిన ప్రశ్నలతో అతడిని విసిగించా. ఇక మైదానంలో అడుగుపెట్టాక ధోనీ గొప్పతనమేంటో తెలిసింది. క్షణాల్లో మారిపోయే పొట్టి ఫార్మాట్‌లో.. మ్యాచ్‌ను చదవడం ఎలాగో ధోనీని చూసి నేర్చుకోవాలి’ అని డుప్లెసిస్ అన్నాడు.
స్మిత్, ఫ్లెమింగ్, ధోనీని దగ్గరి నుంచి పరిశీలించడంతోనే తాను నాయకుడిగా ఎదగ గలిగానని డుప్లెసిస్ పేర్కొన్నాడు. గత సీజన్‌కు ముందు విరాట్‌కోహ్లీ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా తప్పుకోగా.. అతడి స్థానంలో ఆర్సీబీ డుప్లెసిస్‌ను నాయకుడిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి ఐపీఎల్-16వ సీజన్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే జట్లు సన్నాహాలు మొదలెట్టాయి. ఏప్రిల్ 2న జరుగనున్న తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.